ఉద్యోగం పురుష లక్షణం అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు ఆగ, మగ అనే తేడా లేకుండా పోలోమంటూ అందరూ ఉద్యోగాలు చేసేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మగవాళ్ల సంపాదన కంటే ఆడవాళ్లే సంపాదన ఎక్కువైంది. ఉన్నత స్థానాల్లో సత్తా చాటుతున్నారు. ఇంటా, బయటా వారికి ఎదురులేకుండా పోతుంది. దీంతో వారి ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు మహిళల చేతిలో నాలుగురాళ్లు ఉంటే చీరలు, షాపింగులకే ఎక్కువ ఖర్చు చేసేవాళ్లు. కానీ ఇప్పుడంతా ట్రెండ్ మారింది. మగవాళ్లతో ధీటుగా వాళ్లు కూడా మద్యం, సిగరెట్లు, ప్లబ్బు కల్చర్ ఎక్సట్రా.. ఎక్సట్రా.. పోటీ పడుతున్నారు.
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ఉద్యోగం చేస్తున్న ఓ మహిళ మద్యం సేవించి ఆఫీసుకు వెళ్లిన కారణంగా తన ఉద్యోగాన్ని కోల్పోయింది. అయితే చివర్లో మాత్రం ఆ మహిళ అదిరిపోయే ట్వీస్ట్ ఇవ్వడం గమనార్హం. ఇక అసలు విషయంలోకి వెళ్లే.. ప్రపంచంలో ఎక్కడైనా సరే ప్రతీ ఉద్యోగానికీ కొన్ని నియమాలు, నిబంధనలు ఉంటాయి. వీటిని పాటించకపోతే కంపెనీ యాజమాన్యాలు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక మద్యం సేవించి ఆఫీస్ వస్తే అస్సలు ఎవరూ కూడా సహించరు. గప్ చుప్ గా చేసుకుంటే ఒకేగానీ.. యాజమాన్యం కంట్లో పడితే ఇక ఉద్యోగం ఊష్ కాకి అయినట్లే లెక్క. అచ్చం ఇలాంటి సంఘటననే తాజాగా స్కాట్లాండ్లో ఎడిన్ బర్గ్ లో వెలుగుచూసింది.
మాల్గోర్జాటా క్రోలిక్ అనే మహిళ ఎడిన్ బర్గ్ లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఆ కంపెనీకి ఆల్కహాల్ జీరో టాలరెన్స్ పాలసీ ఉంది. దీంతో కంపెనీ నిబంధనల ప్రకారం ఉద్యోగానికి వచ్చే ముందు ఎవరు కూడా మద్యం సేవించకూడదు. ఉద్యోగులు మద్యం సేవించినట్లు తెలిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటారు. మాల్గోర్జాటా క్రోలిక్ తన షిప్ట్ కంటే తొమ్మిది గంటల ముందు మద్యం సేవించారు. ఆమె షిప్ట్ మధ్యాహ్నం 2 గంటలకు ఉండగా ఆమె ఉదయం 5గంటలకు మద్యం సేవించినట్లు మీడియా నివేదికల ఆధారంగా తెలుస్తోంది.
ఆమె యథావిధిగా తన షిప్ట్ సమయానికి ఆఫీసుకు వెళ్లింది. సదరు మహిళ వద్ద లిక్కర్ వాసన రావడంతో కంపెనీ యాజమాన్యం ఆమెను జాబ్ నుంచి తొలగించారు. కనీసం ఆమె తన వర్షన్ చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదట. దీంతో ఆమె తనకు అన్యాయం జరిగిందని కోర్టును ఆశ్రయించింది. తన షిప్ట్ కంటే తొమ్మిది గంటల ముందు తాను మద్యం సేవించానని కోర్టుకు విన్నవించింది. ఈ విషయం రుజువు కావడంతో మాల్గోర్జాటా క్రోలిక్ కు కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది.
సదరు మహిళకు కంపెనీ 5,454యూరోలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ విలువ మన కరెన్సీలో అక్షరాల ఐదు లక్షల 50వేలు. దీంతో కంపెనీ సైతం సదరు మహిళకు ఆ డబ్బును చెల్లించింది. కాగా సదరు మహిళ ఆ కంపెనీలో 11ఏళ్లుగా పని చేస్తుందట. మొత్తానికి మద్యం సేవించిందనే కారణంతో మహిళను ఉద్యోగం నుంచి తొలగించిన కంపెనీ చివరికీ ఆమెకు నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. మొత్తానికి ఈ సంఘటన చాలా విచిత్రంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.