Today (07-02-23) Business Headlines:
హైదరాబాదులో డచ్ ఐటీ సంస్థ విస్తరణ
డచ్ దేశానికి చెందిన గ్జేబియా ఇంజనీరింగ్ సంస్థ తన ఆఫీసును హైదరాబాదులో విస్తరించింది. మూడేళ్లలో 650 మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ సంస్థ 19 దేశాల్లో ప్రత్యేక సాఫ్ట్’వేర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ సర్వీసులను అందిస్తోంది. కంపెనీ ఫౌండర్, సీఈఓ కిరణ్ మాట్లాడుతూ తమ సాఫ్ట్’వేర్ ప్రొడక్టుల డివిజన్ కొన్నేళ్లుగా 30 శాతం చొప్పున గ్రోత్ సాధిస్తోందని చెప్పారు. 16 ఏళ్ల కిందట 17 మందితో ప్రారంభమైన గ్జేబియా ప్రొడక్ట్ ఇంజనీరింగ్ సంస్థలో 2025 నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య వెయ్యికి చేరుతుందని చెప్పారు.
శ్రీసిటీలో బ్లూస్టార్ ఏసీలకి శ్రీకారం
ఆంధ్రప్రదేశ్’లోని శ్రీసిటీలో నిర్మించిన బ్లూస్టార్ కంపెనీ ప్లాంటులో అత్యాధునిక ఏసీల ఉత్పత్తి ప్రారంభమైంది. దాదాపు 27 ఎకరాల్లో 350 కోట్ల రూపాయలతో ఏర్పాటుచేసిన ఈ ప్లాంటులో సంవత్సరానికి 3 లక్షల ఇన్వర్టర్ ఏసీలను తయారుచేసే సామర్థ్యం ఉంది. ఈ కెపాసిటీని భవిష్యత్తులో 12 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు మరో 200 కోట్లు పెట్టుబడి పెడతారు. ఈ ప్లాంట్ వల్ల ఇప్పుడు 750 మందికి ఉద్యోగాలు దొరుకుతాయని కంపెనీ ప్రతినిధులు చెప్పారు.
ఇండియా ఎనర్జీ వీక్-2023 ప్రారంభం
ఇండియా ఎనర్జీ వీక్-2023 ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బెంగళూరులో ఆరంభించారు. ఇంధన రంగం అవకాశాల గని అని చెప్పారు. వచ్చే పదేళ్లలో ఈ సెక్టారులోనే అధిక డిమాండ్ నెలకొంటుందని తెలిపారు. ప్రస్తుతం ఇంధన రంగంలో పెట్టుబడులకు ఇండియా అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఇంధన సంఘం గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా చమురుకు ఉన్న గిరాకీలో భారతదేశం వాటా 5 శాతం. ఇది భవిష్యత్తులో 11 శాతానికి పెరగొచ్చని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.
హైదరాబాద్’లో ఇ-డబుల్ డెక్కర్ బస్సులు
వచ్చే ఆరు నెలల్లో హైదరాబాద్ రోడ్లపై విద్యుత్ డబుల్ డెక్కర్ బస్సులు తిరగనున్నాయి. అశోక్ లేల్యాండ్ అనుబంధ సంస్థ స్విచ్ మొబిలిటీ.. టీఎస్ఆర్టీసీకి 500 ఎలక్ట్రిక్ బస్సులను అందించనుంది. ఈ బస్సులను ఏడాది వ్యవధిలో రెండు విడతల్లో సరఫరా చేయనుంది. కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ నుంచి మరో 450 బస్సులను అందించనుంది. మొత్తం బస్సుల మెయింటనెన్స్’కి తెలంగాణ రాష్ట్రంలో 2 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్నట్లు స్విచ్ మొబిలిటీ సీఈఓ మహేశ్ బాబు చెప్పారు.
రోజుకి రూ.లక్ష కోట్లకు పైగా సంపద ఆవిరి
అదానీ గ్రూపు సంస్థల సంపద తొమ్మిది రోజుల్లోనే తొమ్మిదిన్నర లక్షల కోట్ల రూపాయలు ఆవిరైంది. అంటే.. రోజుకి సగటున లక్ష కోట్ల రూపాయలు పైనే కరిగిపోయింది. అదానీ గ్రూపులోని 10 లిస్టెడ్ కంపెనీల్లో ఏడు కంపెనీల షేర్లు నిన్న సోమవారం కూడా నష్టపోయాయి. అత్యధికంగా అదానీ ట్రాన్స్’మిషన్ స్టాక్స్ వ్యాల్యూ 10 శాతం పతనమైంది. హిండెన్’బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ వల్లే ఈ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లలో నెలకొన్న భయాలను తొలగించేందుకు అదానీ గ్రూపు చర్యలు ప్రారంభించింది.
స్టాక్ బ్రోకర్లకు, క్లియరింగ్ సభ్యులకు సెబీ షాక్
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా.. సెబీ.. కీలక నిర్ణయం తీసుకుంది. స్టాక్ బ్రోకర్లు మరియు క్లియరింగ్ సభ్యులకు షాకిచ్చే ప్రతిపాదన చేసింది. ట్రేడింగ్ ముగిశాక క్లయింట్ల మొత్తం డబ్బులను తమ వద్ద ఉంచుకోకుండా క్లియరింగ్ కార్పొరేషన్’కి ట్రాన్స్’ఫర్ చేయాలని ప్రపోజ్ చేసింది. గ్రీన్ డెట్ సెక్యూరిటీలను జారీ చేసేవారు ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించే లేబుళ్లు, డేటా వాడకం మరియు ఇతర అనుచిత విధానాలు అమలుచేయొద్దని సెబీ హెచ్చరించింది. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లు తమ పథకాలను డైరెక్టుగా పెట్టుబడిదారులకే ఆఫర్ చేయాలని సూచించింది.