Farmers Income: ఈ సంవత్సరం రైతుల ఆర్థిక పరిస్థితి బాగుంటుందని ఒక అధ్యయన సంస్థ శుభవార్త చెప్పింది. రబీ సీజన్‌లో ఆహారధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో నమోదవుతుందని అంచనా వేసింది. ఓపెన్ మార్కెట్‌లో పంటల రేట్లు కూడా భారీగానే పెరగనున్నాయని.. ఫలితంగా.. కర్షకులకు లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పేర్కొంది. ఎరువుల రేట్లు సైతం దిగొస్తాయని, తద్వారా అన్నదాతలకు అన్నివిధాలుగా కలిసొస్తుందని వివరించింది.
నువామా ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ అనే సంస్థ ఈ మేరకు నివేదికను విడుదల చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం.. రబీ సీజన్‌లో ఆహారధాన్యాల దిగుబడి పెరగనుండటం వరుసగా ఇది నాలుగో ఏడాది. 2023వ సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన 2వ ముందస్తు అంచనాలు కూడా ఈ విషయాలనే ప్రస్తావించాయి. ఆహారధాన్యాలతోపాటు నూనె గింజల ఉత్పత్తి కూడా ఈసారి గతంలో ఎన్నడూ లేనంతగా జరగనుంది.
read more: Financial Advises: ఆర్థికంగా పైకి రావాలంటే ఏం చేయాలి? ఎక్కడ పెట్టుబడి పెట్టాలి?
రబీలో ఆహారాధాన్యాల దిగుబడి 170 మిలియన్ టన్నులకు పైగా నమోదు కానుంది. ఇది.. పోయినేడాదితో పోల్చితే 6.2 శాతం ఎక్కువ కావటం గమనించాల్సిన అంశం. ఇదిలా ఉండగా.. నూనె గింజల ఉత్పత్తి ఈ సంవత్సరం 4.6 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 14.6 మిలియన్ టన్నులకు చేరనుంది. 2022-23 ఏడాది మొత్తమ్మీద ఆహారధాన్యాల దిగుబడి రెండున్నర శాతం వృద్ధి చెందనుంది.
కిందటేడాది రబీ సీజన్ కన్నా ప్రస్తుత రబీ సీజన్‌లో గోధుమల రేట్లు ఏకంగా 20 శాతం పెరిగాయి. గడచిన 3 నెలల్లోనే 6 శాతం ప్రియమయ్యాయి. దీనికితోడు ఈ సీజన్‌లో కేంద్ర ప్రభుత్వం గోధుమల సేకరణను పెద్దఎత్తున చేపట్టనుంది. దీనివల్ల కూడా ధరలు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో రైతుల చేతి నిండా డబ్బు మెదులుతుంది. మరో వైపు.. దేశవ్యాప్తంగా జలాశయాల్లో నీటి మట్టాలు పదేళ్ల సగటు కన్నా పైనే కొనసాగుతున్నాయి. అందువల్ల కర్షకులు ఖరీఫ్ సీజన్‌ను సంతోషంగా ప్రారంభించొచ్చు.
పంటల పెట్టుబడికి కావాల్సిన డబ్బు ముందే అందుతుండటం.. అంటే.. రబీ సీజన్‌లోనే చేతికొస్తుండటం.. రిజర్వాయర్లు నిండు కుండలను తలపిస్తుండటం అన్నదాతల వ్యవసాయానికి అనుకూల పరిస్థితులు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అగ్రి-ఇన్‌పుట్ ఇండస్ట్రీకి ఇవి కలిసొచ్చే సూచనలు. ముడి పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడంతో ఎరువుల రేట్లు కూడా నేల చూపులు చూసే అవకాశం ఉంది. ఎరువుల ధరలు దిగిరావటం వల్ల రైతులకు మాత్రమే కాదు.
చిన్న కంపెనీలకు మరియు సబ్సిడీ బిల్లుల రూపంలో సర్కారుకు ప్రయోజనం కలుగుతుందని నువామా ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ సంస్థ అభిప్రాయపడింది. అయితే.. రుతుపవనాలు మన దేశంలోకి ప్రవేశించటానికి ఇంకా 3 నెలల సమయం ఉన్నప్పటికీ అప్పుడే ఎల్‌నినో ప్రభావంపై వార్తలొస్తున్నాయి. ఎల్‌నినో వల్ల రుతుపవనాలు ముఖం చాటేస్తే వానలు పడక పంటల ఉత్పత్తి పడిపోయి చివరికి ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.