కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ నటుడు పొట్టి వీరయ్య ఆదివారం సాయంత్రం గుండెపోటుతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కన్నుమూశారు. దక్షిణాది భాషల్లో దాదాపు 500 చిత్రాలలో ఆయన నటించారు. సోమవారం పొట్టి వీరయ్య అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరుగబోతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
నల్గొండ జిల్లా సూర్యాపేట తాలూకా తిరమలగిరి మండలం ఫణిగిరి ఆయన స్వగ్రామం. గట్టు సింహాద్రయ్య, నరసమ్మలకు జన్మించిన వీరయ్య హెచ్.ఎస్.సి. వరకూ చదువుకున్నారు. హైస్కూల్ రోజుల నుండే నటనమీద మక్కువతో నాటకాలు వేయడం మొదలెట్టారు. ఆంజనేయుడి పాత్ర, బాలనాగమ్మలో మాయల ఫకీరు సహాయకుని పాత్ర ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. దాంతో యుక్తవయసులో సినిమాల్లో నటించాలనే కోరికతో చెన్నయ్ చేరారు.
ఒకానొక సమయంలో శోభన్ బాబును కలిసి తన మనసులోని కోరికను ఆయన దగ్గర వెల్లడించగా, బి. విఠలాచార్యను కలుసుకోమని సలహా ఇచ్చారట. దాంతో బి. విఠలాచార్యను కలిసి, ఆయనను మెప్పించి, తొలి అవకాశాన్ని అందుకున్నానని పొట్టి వీరయ్య చెబుతుండేవారు. కాంతారావు, భారతి జంటగా బి. విఠలాచార్య రూపొందించిన ‘అగ్గిదొర’తో పొట్టి వీరయ్య నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. 1967లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఎన్టీయార్, కాంతారావు, కృష్ణ, సత్యనారాయణ, రాజనాల, నరసింహారావు తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన పలు చిత్రాలలో పొట్టి వీరయ్య నటించారు. ‘వీరపూజ, జగన్మోహిని, మహాబలుడు, అగ్గిమీద గుగ్గిలం, అగ్గివీరుడు, రాజసింహ, గండరగండుడు, సుగుణ సుందరి కథ’ వంటి జానపద చిత్రాలు ఆయనకు గుర్తింపు నిచ్చాయి. దాసరి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తొలి చిత్రం ‘తాతామనవడు’లోనూ పొట్టి వీరయ్య నటించారు. దాసరి దర్శకత్వం వహించిన ‘రాధమ్మ పెళ్ళి, సంసారం – సాగరం’, ‘దేవుడే దిగివస్తే’ వంటి చిత్రాలలో తనకు చక్కని పాత్రలు ఇచ్చారని పొట్టి వీరయ్య చెబుతుండేవారు. దాసరి దర్శకత్వంలోనే మూవీ మొఘల్ డి. రామానాయుడు నిర్మించిన ‘బ్రహ్మపుత్రుడు’ సినిమాలో అప్పట్లో తనకు అత్యధిక పారితోషింగా పాతిక వేలు ఇచ్చారని వీరయ్య అన్నారు.
1974లో మల్లికతో పొట్టి వీరయ్య వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు విమల, విజయదుర్గ. రెండో అమ్మాయి విజయదుర్గ తండ్రి బాటలో నటిగా మారింది. పలు టీవీ సీరియల్స్ తో పాటు కొన్ని సినిమాల్లోనూ నటించింది. 2008లో పొట్టి వీరయ్య భార్య మృతి చెందారు. సినిమా, టీవీ సీరియల్స్ లో అవకాశాలు తగ్గిన సమయంలో పొట్టి వీరయ్య కృష్ణనగర్ లో టెలిఫోన్ బూత్ ను నిర్వహించాడు. ‘పొట్టి వీరయ్య ఫోన్ బూత్’ అనేది అప్పట్లో చాలామందికి ఓ లాండ్ మార్క్ గా ఉండేది. ఆయన చివరి రోజుల్లో పలువురు నటులు, దర్శకులతో పాటు ‘మా’ అసోసియేషన్ సైతం ఆర్థికంగా ఆయనకు అండగా నిలిచింది.