ఏపీలో జిల్లాల విభజనపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు చేశారు. జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా, రాజకీయ కోణంలోనే జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త జిల్లాలకు సంబంధించిన సమస్యలను సరిదిద్దుతామన్నారు. మరోవైపు ఏపీలో తాజా పరిస్థితులపై చంద్రబాబు పార్టీ నేతలతో చర్చించారు. జగన్ అనుసరిస్తున్న విధానాలతో ఏపీ కూడా త్వరలో శ్రీలంకలా మారే ప్రమాదం కనిపిస్తుందన్నారు. జగన్ పాలనపై ఆయన సొంత సామాజిక వర్గం కూడా సంతృప్తిగా లేదని చంద్రబాబు ఆరోపించారు.
మరోవైపు జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగుడుతూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణను రూపొందించినట్లు చంద్రబాబు తెలిపారు. కరెంట్ చార్జీల మోత, పన్నుల భారంపై ‘బాదుడే బాదుడు’ పేరుతో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. కరెంట్ ఎందుకు పోతోందో, బిల్లు ఎందుకు పెరిగిందో సీఎం జగన్ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఏపీలో అక్రమ మద్యం రవాణా ద్వారా జగన్ వేల కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారానే కల్తీ మద్యం మద్యం అమ్ముతున్నారని చంద్రబాబు ఆరోపించారు. కల్తీ మద్యం, జె-ట్యాక్స్ వంటి అంశాలపై పోరాటం కొనసాగిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిలో 80 శాతం జరిగిన పనులను కూడా జగన్ పూర్తి చేయలేకపోయారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.