మరికొన్ని గంటలైతే థియేటర్లోకి రాబోతోంది అవతార్ ట్రైలర్. ‘డాక్టర్ స్ట్రేంజ్: ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్’ సినిమాతో పాటే.. మే 6న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. అవతార్ టు ట్రైలర్ కోసమే డాక్టర్ స్ట్రేంజ్ మూవీకి భారీ ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇక ఈ ట్రైలర్ విడుదలకు ముందే.. లీకై సోషల్ మీడియాలో ప్రత్యక్షమైనట్లు తెలుస్తుంది. ఊహించని విధంగా ఈ లీకేజీకి సంబంధించిన ఫుటేజ్ లింక్‌లు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో.. వెంటనే ఆ వీడియోను ట్విటర్ డిలీట్ చేసినట్టు తెలుస్తోంది. ఇంకా ఈ వార్త జనాల్లోకి రాకముందే ట్విట్టర్ నుంచి తొలగించడంతో.. మేకర్స్ కాస్త ఊపిరిపీల్చుకున్నారట. అసలు ఈ ట్రైలర్ ఎవరు లీక్ చేశారు.. ఎలా లీక్ చేశారు..అన్న విషయాలేవి ఇంతవరకు తెలియలేదు.
అయితే ఇటీవలె ఈ మూవీ ట్రైలర్‌ను ‘సినిమా కాన్’లో ప్రీమియర్‌గా ప్రదర్శించారు. అక్కడే ఏదో తేడా కొట్టొచ్చు అనే టాక్ ఉంది. అయితే ఈ న్యూస్ అలా వచ్చిందో లేదో.. నెట్టింట్లో ట్రైలర్ కోసం తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. కానీ అప్పటికే ట్విట్టర్ డిలీట్ చేయడంతో.. ప్రస్తుతం ఎక్కడా కూడా అవతార్ టు ట్రైలర్ కనిపించడం లేదు. అయితే ఇదంతా పబ్లిసిటీ స్టంట్‌లో భాగమేనని అంటున్నారు. ఇదిలా ఉంటే.. లీకైన ఈ ట్రైలర్ చూసిన వారు.. అవతార్ టు మరో విజువల్ వండర్ అని అంటున్నారు. దర్శకుడు జేమ్స్ కామేరాన్ మరో అద్భుతమైన లోకంలోకి తీసుకెళ్లిపోయినట్టు తెలుస్తోంది. దాంతో ఈ సీక్వెల్ పై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇక అవతార్.. ది వే ఆఫ్ వాటర్ పేరుతో వస్తున్న ఈ సీక్వెల్‌ను.. ఏకంగా 160 భాషల్లో.. డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు జేమ్స్ కామెరాన్ సృష్టించిన విజువల్ వండర్ ‘అవతార్’ 2009 లో వచ్చి.. సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే.