ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లయిన వారిని దూరంగా ఉంచడాన్ని మనందరం చూస్తూనే ఉంటాం. సాధారణంగా ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అంటారు. ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలను చేపట్టరు. ముఖ్యంగా అత్తగారింట్లో కోడలిని ఉంచకూడదని భావిస్తారు. ఎందుకంటే ఉత్తరాయణ, దక్షిణాయన కథల ప్రకారం ఆషాఢ మాసంలో శ్రీమహావిష్ణువు నిద్రలోకి వెళ్తాడని, దీనివల్ల వివాహం చేసుకున్న దంపతులకు ఆయన ఆశీస్సులు లభించవనే నమ్ముతారు. దీంతో ఆషాఢంలో కొత్తగా వచ్చిన కోడలిని అత్తగారింట్లో ఉంచకుండా పుట్టింటికి పంపించేస్తారు. ఈ మాసంలో తొలకరి మొదలై మంచి వర్షాలు కురుస్తాయి. పొలం పనులు జోరందుకుంటాయి. ఇంటిలో అందరూ వ్యవసాయ పనులపై పొలానికి వెళ్లినపుడు కొత్తగా పెళ్లయిన జంట ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడతారు. అందుకే సంప్రదాయం పేరిట కొత్త కోడలిని పుట్టింటికి పంపేస్తారు. కొత్త అల్లుడు అత్తగారింటి గడప తొక్కకూడదన్న సంప్రదాయం కూడా ఈ కారణం వల్లే పాటిస్తారు.
Read Also: Enugu Movie Review: ఏనుగు మూవీ రివ్యూ
అటు ఆషాఢంలో భార్యాభర్తల కలయిక వల్ల గర్భం దాల్చే అవకాశాలు ఉండకూడదని కొత్త దంపతులను దూరంగా ఉంచుతారు. ఆషాఢ మాసంలో వాతావరణం చల్లబడటం ద్వారా వైరస్, బ్యాక్టీరియాలు పెరిగి అంటువ్యాధులు ఎక్కువవుతాయి. ఈ సమయంలో మహిళ గర్భం దాలిస్తే పుట్టబోయే బిడ్డపై ఆ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే కడుపులోని పిండానికి తొలి 3 నెలలు చాలా కీలకం. అలాగే ఆషాఢంలో గర్భం వస్తే మండు వేసవిలో కాన్పు ఉంటుంది. అప్పుడు ఎండ తీవ్రత తట్టుకోలేకపోతారు. అందుకే ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లయిన భార్యాభర్తలను దూరంగా ఉంచుతారు. అయితే ఆషాఢ మాసం నూతన జంటలను కొన్నాళ్లపాటు విడదీసి విరహంలో ముంచుతుందని మాత్రమే భావించాల్సిన అవసరం లేదు. వారి మధ్య బంధాన్ని మరింతగా బలపరుస్తుందని విశ్వసించాలని పురోహితులు సూచిస్తున్నారు.