తెలుగు రాష్ట్రాలు, సినీ అభిమానులు తారకరత్నను మరచిపోలేక పోతున్నారు. 23 రోజులు మృత్యువు తో పోరాడి తారక్ రత్న కనుమూయడంతో నందమూరి కుటుంబంతో పాటు యావత్ సినీ లోకం, ఆయన అభిమానులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ముఖ్యంగా ఆయనతో అనుబంధం ఉన్న వారు కన్నీటిపర్యంతం అవుతున్నారు. తారకరత్న ఇక లేరన్న వార్త ఖమ్మం జిల్లా వాసుల్ని కలచివేసింది. ముఖ్యంగా ఆయన ఎక్కువగా సందర్శించే లంకపల్లి వాసులలో విషాదం నింపింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలో సిని హీరో తారక్ రత్న కి నున్న రామకృష్ణ అనే స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహంతో ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు వచ్చి అడవిలో కొలువై ఉన్న నీలాద్రీశ్వరుని దర్శించుకొని స్నేహితుడు రామకృష్ణ తో రెండు మూడు రోజులు గడిపేవారు తారకరత్న.
Read Also: Top Headlines @5PM: టాప్ న్యూస్
2007 సంవత్సరం నుండి ప్రతి యేటా నీలాద్రీశ్వరుని దర్శించుకోవడం తారకరత్నకు పరిపాటిగా మారింది. ఆ పరమ శివుని దర్శించుకొని వెళ్లే క్రమంలో లంకపల్లి వాసులతో తారక్ కు మంచి అనుబంధం ఏర్పడింది. శివరాత్రి వచ్చింది అంటే చాలు లంకపల్లి కి తారక్ రత్న వస్తాడు అని నున్న రామకృష్ణ ఇంటి వద్ద తారక్ ని చూడటానికి ఫోటోలు దిగటానికి క్యూ కట్టేవాళ్ళమని మిత్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తారక్ రత్న ప్రతి ఒక్కరిని బంధుత్వం కలుపు కొని తమ్ముడు,బాబాయి అని అప్యాయతగా పలకరించే వారని చెబుతున్నారు.
తారక్ రత్న గుండె పోటుకు గురైన తరువాత నున్న రామకృష్ణ ఆధ్వర్యంలో నీలాద్రీశ్వరుని ఆలయంలో మృత్యువు జయించాలని ప్రత్యేక పూజలు నిర్వహించాం అని తెలిపారు. ఈ సంవత్సరం మృత్యువు ను జయించి శివరాత్రి నాడు వస్తారని అనుకుంటే ఇలా మృతువాత పడటంతో లంకపల్లి వాసులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. తారకరత్నను తాము మరిచిపోలేకపోతున్నామని, శివరాత్రినాడే శివైక్యం పొందడంతో ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుందని లంకపల్లి వాసులు అంటున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తారకరత్న అకాల మరణం అందరినీ బాధించింది. సినీరంగంలో ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు కొనసాగించారు. రేపు మ.3 గంటలకు మహా ప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు జరగనున్నాయి.
Read Also: Tarakaratna Political: ఎమ్మెల్యే టికెట్ ఇద్దామనుకున్నా.. ఇంతలోనే ఇలా