మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇంకా కోమాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు ఆయన హాస్పిటల్ బెడ్ పై ఉంటే మరోవైపు ఆయన నటించిన పొలిటికల్ డ్రామా “రిపబ్లిక్” విడుదలకు సిద్ధమవుతోంది. సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, రమ్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ‘రిపబ్లిక్’ సినిమాకు దేవ కట్టా దర్శకత్వం వహించారు. భగవాన్, పుల్లారావు నిర్మించారు. అక్టోబర్ 1న సినిమా విడుదలవుతోంది.
Read Also : ఈ స్టార్స్ సినిమాల ట్యాక్స్ కట్టారా ? ఏపీ ప్రభుత్వం ఆరా !
నిన్న రాత్రి జరిగిన ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న పవన్ తన ఆవేశపూరిత ప్రసంగంలో సాయి ఇంకా కళ్ళు తెరవలేదని, అతను ఇంకా బెడ్ పై కళ్ళు మూసుకుని పడుకున్నాడని వెల్లడించి అందరికీ షాక్ ఇచ్చాడు. పవన్ వెల్లడించిన ఈ విషయం తేజ్ అభిమానులను మరోసారి ఆందోళనకు గురి చేసింది. ఈ నేపథ్యంలో అపోలో వైద్యుల నుంచి తేజ్ ఆరోగ్యంపై కొత్త అధికారిక అప్‌డేట్ ఎప్పుడు వస్తుందా ? అని ఎదురు చూస్తున్నారు.
సెప్టెంబర్ 10న సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి గురయ్యాడు. అప్పటి నుండి ఆయన అపోలో హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నాడు. మొదట్లో సాయి ఆరోగ్యంపై మెగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తేజ్ కోలుకుంటున్నారని వైద్యులు హామీ ఇవ్వడంతో అంతా సైలెంట్ గా ఆయన బాగా కోలుకుని, పూర్తి ఆరోగ్యంతో హాస్పిటల్ నుంచి బయటకు రావాలని ఎదురు చూస్తున్నారు. వారం రోజుల క్రితం సాయి వెంటిలేటర్ తీసేశారని, ఆయనను త్వరలో జనరల్ వార్డుకు తరలించనున్నట్లు డాక్టర్ వెల్లడించారు. అప్పటి నుండి సాయి ఆరోగ్యంపై ఎలాంటి అప్‌డేట్ లేదు.