హైదరాబాద్‌లో ఫ్లెక్సీల పరంపర కొనసాగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను, ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ నిర్ణయాలను విమర్శిస్తూ ఇవి వెలుస్తుండటం గమనార్హం. ఇటీవల కమలం పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా పీఎం మోడీ హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో ఆయన దేశాన్ని దోచేస్తున్నారనే ఆరోపణలతో కూడిన ఫ్లెక్సీలు రాత్రికిరాత్రే ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. అదే కోవలో ఇప్పుడు వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ బ్యానర్లు కట్టారు. ఇంటి అవసరాలకు వాడుకునే ఎల్‌పీజీ సిలిండర్ రేటు నిన్న బుధవారం నుంచి రూ.50 పెరిగింది.
ఈ కాన్సెప్ట్‌తో ఇవాళ భాగ్యనగరంలో రెండు కటౌట్లు పెట్టారు. ఒక ఫ్లెక్సీలో సిలిండర్ బొమ్మ పెట్టి, దాని పైన మోడీ ముఖాన్ని అతికించారు. గ్యాస్ బండ గ్రాఫిక్ చిత్రం పైన ప్రస్తుతం హైదరాబాద్‌లోని సిలిండర్ రేటు (రూ.1105)ను స్పష్టంగా కనిపించేలా ప్రింట్ చేశారు. ఆ పిక్చర్ పక్కనే ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే కామెంట్‌ను ప్రస్తావించారు. ‘మోడీ సార్ ఇమేజ్ గ్రాఫ్ రోజురోజుకీ పెరిగిపోతోంది’ అని పేర్కొన్నారు. అంటే.. గ్యాస్ సిలిండర్ రేటు ఏవిధంగా అయితే నిత్యం పెరుగుతోందో మోడీ మీద మాకు అభిమానం కూడా అలాగే పెరిగిపోతోందంటూ పరోక్షంగా సెటైర్ వేశారు.
ఈ ఫ్లెక్సీకి మరో మూలన ‘ఆలీబాబా అర డజన్ దొంగలు” క్లిప్పింగ్‌ను సైతం జతచేశారు. కటౌట్‌కి కిందేమో “బైబైమోడీ” అనే హ్యాష్‌ట్యాగ్‌ను రాశారు. మరో కటౌట్ మరింత క్రియేటివ్‌గా ఉంది. అందులో సూపర్ మ్యాన్ సిలిండర్‌ను పట్టుకొని మబ్బుల్లోకి ఎగురుతున్న గ్రాఫిక్‌ని జోడించారు. దాని పైన ‘అప్నా సిలిండర్ లేకే ఉద్ గయా’ అని కామెంట్ పెట్టారు. గ్యాస్ ధర ఆకాశమే హద్దుగా పెరిగిపోతోందనే అర్థం కూడా ఇందులో ఉందని పరిశీలికులు అంటున్నారు. మొత్తానికి వీటిని ఎవరు ఏర్పాటుచేశారో గానీ జనాన్ని ఇట్టే ఆకర్షిస్తున్నాయి. ఈ ఫ్లెక్సీలపై తెలంగాణ బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.