రైటర్ గా పలు విజయవంతమైన చిత్రాలకు రచన చేసిన కొరటాల శివ, దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుకున్న తర్వాత అపజయాన్నే ఎరగలేదు. అయితే కొంతకాలంగా సోషల్ మీడియా ద్వారా తన చిత్రాలకు సంబంధించిన విశేషాలను, తన కార్యకలాపాలను కొరటాల శివ అభిమానులతో పంచుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఇక సోషల్ మీడియాలో కొనసాగాలనుకోవడం లేదని కొరటాల శివ తెలిపారు. ఇకపై మీడియా మిత్రుల ద్వారా తన చిత్రాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియచేస్తానని ఆయన చెబుతున్నారు. జనాలతో తన ఇంటరాక్షన్ కంటిన్యూ అవుతుందని హామీ ఇస్తున్నారు. మీడియం మారినా ప్రజలతో ఉండే బంధంలో మార్పు ఉండదని ఈ సందర్భంగా కొరటాల శివ తెలిపారు. అయితే… సోషల్ మీడియా నుండి కొరటాల శివ తప్పుకోవడానికి కారణం ఏమిటనేది మాత్రం తెలియచేయలేదు. ప్రస్తుతం చిరంజీవితో ‘ఆచార్య’ చిత్రాన్ని రూపొందిస్తున్న కొరటాల శివ… ఆ తర్వాత జూనియర్ ఎన్టీయార్ తో మూవీ చేయబోతున్నారు.