అగ్రరాజ్యమైన అమెరికాతో పాటు యావత్తు ప్రపంచ దేశ దేశాల్లో భయానక వాతావరణాన్ని కరోనా మహమ్మారి సృష్టించింది. కరోనాతో ప్రత్యక్షంగా కొంతమంది దెబ్బతింటే.. మరి కొంత మంది పరోక్షంగా దెబ్బతిన్నారు. మొత్తానికి కరోనా వైరస్ దెబ్బకు మానవుల జీవితాలలో కరోనా కాలాన్ని ఒక విషాద సమయంగా అభివర్ణిస్తున్నారు. అయితే.. అయితే కరోనా వైరస్ సోకిన వారిపై తాజాగా చేసిన పరిశోధనల్లో కొన్ని ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా సోకిన వారిలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, పనితీరు మార్పులు చోటు చేసుకుంటున్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. ఈ అధ్యయనాన్ని కెనడాలోని వాటర్ లూ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించారు. కొవిడ్ సోకిన, సోకని 94 మందిని పరిశోధకులు రెండు బృందాలుగా విభజించి అధ్యయనం చేశారు. కొవిడ్-19 బారినడపడ్డవాళ్లకు శారీరక హాని కాకుండా..పనిచేసేసామర్థ్యంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుందని అధ్యయనంలో తేల్చారు పరిశోధకులు.
కొవిడ్ -19 బారిన పడనివారితో పోలిస్తే కొవిడ్ సోకినవారు పనిచేసేటప్పుడు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని పరిశోధనకు నేతృత్వం వహించిన సైకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ జేమ్స్ బెక్ వెల్లడించారు. కొవిడ్‌తో బాధపడ్డవారి పనితీరు సామర్థ్యం చాలామేర తగ్గిపోయిందని, కొందరు ఉద్యోగాన్ని స్వచ్ఛందంగా వదిలేయాలని అనుకుంటున్నట్లు పరిశోధనలో తేలిందని బెక్ చెప్పారు. కొవిడ్‌తో బాధపడ్డవారు పూర్వస్థితికి రావాలంటే, పనిలో వారికి కొంత వెసులబాటు కల్పించాలని సూచించారు. పనిభారం తగ్గించడం, వారి డెడ్‌లైన్స్‌ని పొడిగించడం, సౌకర్యవంతమైన పని ఏర్పాట్లు చేయడంలాంటివి వారిలో మళ్లీ పనిపట్ల ఉత్సాహాన్ని పెంచుతాయని బెక్ తెలిపారు.