వైసీపీలో కొందరు నేతలు సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ వుంటారు. అందునా నెల్లూరు జిల్లాకు చెందిన నేతలయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్వపక్షంలో విపక్షంలా వ్యవహరిస్తుంటారు. తాజాగా మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి చేసిన కామెంట్లు జిల్లాలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి.
మాఫియాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. రాష్ట్రంలో నక్సలిజం, టెర్రరిజం తగ్గింది. తగ్గాల్సింది ఏదైనా వుందంటే లోకల్ మాఫియానే అన్నారు ఆనం. మాఫియాలు ఈ ప్రభుత్వంలోనే కాదు, గత ప్రభుత్వంలోనూ ఉన్నాయి. ఈ మాఫియాల్లో పోలీసుశాఖవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారన్నారు. ప్రజల్లో పోలీసులపై ఒక న్యాయం చేస్తారని నమ్మకం, భరోసా ఉంది. పోలీసులే మాఫియాల్లో కలిస్తే… దేశంలో, రాష్ట్రంలో సామాన్యులకు భద్రత ఉండదని కామెంట్ చేశారు. వ్యవస్థను బలోపేతం చేయాలంటే, కలుపు మొక్కలను తీసివేయాలన్నారు.
పేరు ప్రసన్నం.. కామెంట్లు సంచలనం
గతంలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో నల్లపురెడ్డి సొంత మండలంలో ఎంపీటీసీ స్థానాలు కోల్పోయారు. కోట పంచాయతీలో ఏ పని జరగాలన్న వైసీపీ నేతలు లంచాలు లేనిదే చేయడం లేదని నల్లపురెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఓపెనింగ్ కార్యక్రమానికి పిలిస్తే డబ్బులు డిమాండ్ చేస్తారా? ఇదేంటి అని ఆయన స్వంత పార్టీనేతలనే నిలదీశారు. కొందరు వైసీపీ నేతల వల్ల నా కుటుంబ పరువు పోయింది.సొంత మనుషులు ఇతర పార్టీలోకి, ఇతర వర్గాలకి వెళ్లిపోయారు. ఇలా మా ఉనికిని కోల్పోవడం చూస్తుంటే.. కన్నీళ్లొస్తున్నాయి అన్నారు. జగనన్న ఇళ్ల విషయంలో నల్లపురెడ్డి తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కడం గమనార్హం. జగన్ అభిమానిగా పేరున్న నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఓ అధికారిక సమావేశంలో జగనన్న ఇళ్ల గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేశాయి.

ప్రభుత్వం కట్టిస్తున్న ఇళ్లలో బెడ్ రూంలు మరీ చిన్నవిగా ఉంటున్నాయని.. అందులో కాస్త పెద్ద సైజున్న మంచం వేసే పట్టే పరిస్థితి లేదని ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. రెడీ మేడ్ మంచాలేవీ ఈ బెడ్ రూంల్లో పట్టవన్నారు. గదికి తగ్గట్లు కొలతలు తీసుకుని మంచం తయారు చేయాలి. బెడ్ రూం మరీ 24 గజాల్లో కట్టిస్తున్నారని.. అవి మరీ చిన్నవి అవుతాయన్నారు. కొత్త జంటలు శోభనం చేసుకోవాలనుకుంటే హాల్లో చేసుకుని బెడ్ రూంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని ప్రసన్నకుమార్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు మంత్రి అనిల్, అధికారుల సమక్షంలో చేశారు నల్లపురెడ్డి.