కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే కర్ణాటకలో రిజర్వేషన్ల పరిమితిని 50 శాతం నుంచి 75 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ప్రకటించడంపై ఘాటుగా స్పందించారు మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఓటమి దిశగా పయనిస్తోందని చెప్పారు. సిద్దరామయ్య ఘోరంగా ఓడిపోతాడు కాబట్టి, రాష్ట్రంలో రిజర్వేషన్ పరిమితిని పెంచే ప్రశ్న తలెత్తదని యడియూరప్ప అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మేం (బీజేపీ) మా శక్తి మేరకు అన్నీ చేస్తామని చెప్పారు.
Also Read: ACB Raids: ఏపీలో అవినీతి అధికారులపై దాడులు.. లక్షల్లో నగదు స్వాధీనం
మే 10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలో వస్తే ముఖ్యమంత్రి పదవిపై దృష్టి సారించిన మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. జనాభా ఆధారంగా రిజర్వేషన్ పరిమితిని 50 శాతం నుండి 75 శాతానికి పెంచడానికి, అన్ని కులాలకు రిజర్వేషన్లను విస్తరించడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి షెట్టర్, గతంలో డిప్యూటీ సిఎంగా పనిచేసిన సవాడి లింగాయత్ వర్గానికి చెందినవారు. ఇది రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలపై ఆధిపత్యం చెలాయిస్తుంది. బిజెపిని విడిచిపెట్టిన ఇద్దరిపై యెడియూరప్ప మాట్లాడుతూ ప్రభుత్వంలో కీలకమైన శాఖలు అప్పగించినప్పటికీ, బిజెపికి ద్రోహం చేసినందున, లక్ష్మణ్ సవాది, జగదీష్ షెట్టర్‌లకు ఒక్క ఓటు కూడా వేయవద్దని ప్రజలను కోరారు. ఈ ఎన్నికల్లో ఇద్దరు నేతలు ఓడిపోతారని నాకు 100 శాతం నమ్మకం ఉంది. ఇందులో ఎలాంటి సందేహం లేదని యడ్యూరప్ప విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, మే 10న ఒకే దశలో 224 స్థానాలకు ఎన్నికలు నిర్వహించి మే 13న ఫలితాలు వెల్లడికానున్నాయి.