ACB Raids: ఏపీలో అవినీతి అధికారులపై ఏసీబీ దాడులు నిర్వహించింది. సబ్ రిజిస్టర్ , ఎమ్మార్వో కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు చేసింది. పలువురు అవినీతి అధికారులను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. పలు డాక్యుమెంట్లు , లక్షల్లో నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 14400కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తనిఖీలు నిర్వహించి అవినీతి అధికారులను అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా మేడికొండూరు తహసీల్దార్ గుజ్జర్లపూడి కరుణకుమార్ బుధవారం ఏసీబీకి పట్టుబడ్డారు. కారులో లక్షా నాలుగు వేల రూపాయలు దొరకగా.. ఆ నగదుకు సరైన వివరాలు లేకపోవడంతో అవినీతి డబ్బుగా భావించి కేసు నమోదు చేశారు.
విజయనగరం జిల్లా తెర్లాం మండల హౌసింగ్ ఏఈ మత్స వెంకటేశ్వరరావుపై ఏసీబీ కేసు నమోదు చేసింది.ఏసీబీ డీఎస్పీ పి.రామచంద్రరావు తెలిపిన వివరాల మేరకు.. కాలమరాజుపేట గ్రామానికి చెందిన ఇప్పిలి రామకృష్ణ కుటుంబానికి జగనన్న ఇల్లు మంజూరైంది. ఈ ఇంటికి బిల్లు చెల్లించేందుకు హౌసింగ్ ఏఈ రూ.20వేలు డిమాండ్ చేశారు. దీంతో రామకృష్ణ ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ సూచనల మేరకు రూ.20వేలు తెర్లాం హౌసింగ్ కార్యాలయంలో ఏఈకి అందజేశాడు. ఆ వెంటనే ఏసీబీ అధికారులు దాడిచేసి ఏఈని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Read Also: BRS Foundation day: నేడే బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. రాజకీయ తీర్మానాలపై సర్వత్రా ఆసక్తి
వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేసి రూ.5లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయంలో అనధికారికంగా ముగ్గురు పనిచేస్తున్నారని, వారు అధిక వసూళ్లకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు రావడంతో దాడులు చేశామని ఏసీబీ అధికారులు తెలిపారు. కార్యాలయంలో ఉమామహేశ్వరయ్య, ఓబులయ్య, దిలీప్ అనధికారికంగా పనిచేస్తున్నట్టు గుర్తించామన్నారు. వీరికి జీతాలు ఎవరిస్తున్నారనే అంశంపై విచారణ చేస్తున్నామన్నారు. ఒక ప్రైవేట్ వ్యక్తి వద్ద ఉన్న రూ.5లక్షలను స్వాధీనం చేసుకున్నామన్నారు. తిరుపతి రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు జరుగుతున్నాయి.
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలోని సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏసీబీ అధికారులు రూ.50 వేలను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ ఆకస్మిక దాడులు చేసి సిబ్బంది వద్ద రూ.50వేలు నగదు స్వాధీనం చేసుకుంది. పలు రికార్డులను తనిఖీ చేశారు. పొద్దుపోయే వరకు సోదాలు జరుగుతూనే ఉన్నాయి. సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాల్లో ఏసీబీ స్పందనకు పలు ఫిర్యాదులు అందాయని, వాటి ఆధారంగా దాడులు చేసి నగదు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ ప్రసాద్ చెప్పారు.
ఏసీబీ అనంతపురం ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. సబ్ రిజిస్ర్టార్ మహబూబ్ అలీ మేనల్లుడు, డ్రైవర్‌గా పనిచేస్తున్న షేక్ ఇస్మాయిల్ నుంచి ఎలాంటి రికార్డులు లేని రూ.2.27 లక్షల నగదు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగదుతోపాటు పలు డాక్యుమెంట్లను సీజ్ చేశారు. సబ్ రిజిస్ట్రార్ మహమ్మద్ అలీ వద్ద మేనల్లుడు ఇస్మాయిల్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.