వైసీపీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నరేళ్లు పూర్తవుతోంది. మరో రెండున్నరేళ్లు ఆపార్టీనే అధికారంలో ఉండనుంది. అయితే వచ్చే ఎన్నికలను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో వైసీపీ ముందుస్తు వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నుంచి ఎదురయ్యే సవాళ్లపై దృష్టిసారించింది. దీనిలో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఇవ్వబోయే హామీలను ముందుగానే తెలుసుకొని అమలు చేసేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోంది. దీని ద్వారా ముందుగానే ఆపార్టీకి చెక్ పెట్టే ప్రయత్నం చేసేందుకు రెడీ అవుతోంది.
గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి చాలా కారణాలు పని చేశాయి. జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ కు తోడు టీడీపీపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేక ఆ ఎన్నికల్లో బలంగా పనిచేశాయి. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలను గాలికొదిలేశారు. 2019 ఎన్నికల ముందు కొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆయన జిమ్మిక్కులను ప్రజల పెద్దగా పట్టించుకోలేదు. ఇదే విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఎండగట్టి ప్రజలను తనవైపు తిప్పుకోవడంలో విజయం సాధించారు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సంక్షేమ పథకాలకే తొలి ప్రాధాన్యం ఇచ్చారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 80శాతం హామీలను పూర్తి చేశారు. మరో రెండున్నేళ్లలో వందశాతం కంప్లీట్ చేసి ఎన్నికలకు వెళ్లేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఇక టీడీపీ అధికారంలోకి రావాలంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కంటే కూడా ఎక్కువ పథకాలు అమలు చేస్తామని ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే ఆయన వచ్చే ఎన్నికల్లో ఇబ్బడిముబ్బడిగా హామీలు ఇచ్చే అవకాశం ఉందనే వైసీపీ అంచనా వేస్తోంది. ఇప్పటికే టీడీపీ పింఛన్ల పెంపుపై కసరత్తులు చేస్తున్నట్లు అంచనా వేస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక పింఛన్లకు క్రమంగా పెంచుతూ 3వేలు చేస్తామని ప్రకటించింది. అయితే ఏపీలో ఆర్థిక కష్టాల వల్ల పింఛన్ల పెంపు కొంతకాలంగా జరుగడం లేదు. దీనినే టీడీపీ టార్గెట్ చేస్తుంది. ఈ అంశాన్ని టీడీపీ ఖచ్చితంగా వినియోగించుకునే అవకాశం ఉండటంతో ఆపార్టీ నేతలు ఇప్పటి నుంచే దీనికి కౌంటర్ ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది.
గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమేరకు అమలు చేశారో ప్రజలు గుర్తించాలని వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. బాబు అధికారంలోకి వచ్చాక డ్వాకా మహిళలకు ఇచ్చిన హామీలు, రైతు రుణమాఫీ, పసుపు కుంకుమ అమలు చేయలేదని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా బాబు అధికారంలోకి వచ్చేందుకు పింఛన్లను ఏ ఐదువేలో, పదివేలో అంటారని ప్రజలు గుడ్డిగా మోసపోవద్దని ఆయన సూచించారు.
ముందస్తుగానే టీడీపీ అధినేత చంద్రబాబు విశ్వసనీయతను వైసీపీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. దీంతో చంద్రబాబు హామీలపై అటు వైసీపీ, ఇటు టీడీపీలో పెద్దఎత్తున జరుగుతోంది. ఏదిఏమైనా టీడీపీ అధికారంలోకి రావాలంటే జగన్మోహన్ రెడ్డిని మించిన హామీలను చంద్రబాబు ఇవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే బాబు హామీలను ముందే అమలు చేసి నీరుగార్చాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. వైసీపీ సంక్షేమ పథకాలను పూర్తిగా వ్యతిరేకించే చంద్రబాబు ఇప్పుడు ఏమేరకు హామీలిచ్చి ప్రజలను మెప్పిస్తారనేది వేచిచూడాలి.