భారత్‌లో తీవ్రమైన వేసవి కాలం కొనసాగుతోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎండలు దండి కొడుతున్నాయ. వడ గాల్పులతో ప్రజలు అల్లడిపోతున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో వేడి తీవ్రత మరింతే పెరిగే అవకాశం ఉంది. రాబోయే నాలుగు రోజుల్లో తూర్పు భారతదేశంలో వేడిగాలులు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఏప్రిల్ 18,19 తేదీలలో వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
భారత వాతావరణ శాఖ (IMD) ఈ రోజు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నగరాల జాబితాను విడుదల చేసింది. ఈ రోజు వాతావరణ కార్యాలయం యొక్క జాబితాలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రయాగ్‌రాజ్ అగ్రస్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఒడిశాలోని బరిపాడలో 44.2 డిగ్రీలతో రెండో స్థానంలో నిలిచింది. ఝాన్సీ (43.6), బౌధ్ (43.5), డాల్తోన్‌గంజ్ (43.4), ఝర్సుగూడ (43.4), పాట్నా (43.2 ), ఖజురహో (43.2) సంబల్పూర్ (43.2 ) , శ్రీనికేతన్ (43.2) డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయినట్లు ఐఎండి తెలిపింది.
Also Read: Extramarital Affair: అల్లుడితో లాడ్జ్‌కి వెళ్లిన అత్త.. కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్
ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 40.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది, సాధారణం కంటే నాలుగు డిగ్రీలు ఎక్కువ. ఇక్కడ గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదవడం ఇది వరుసగా మూడో రోజు. బుధవారం మేఘావృతమైన వాతావరణం మరియు తేలికపాటి వర్షం ఢిల్లీలో వేడి నుండి కొంత ఉపశమనం కలిగించవచ్చని IMD అంచనా వేసింది. రాబోయే మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుండి మూడు డిగ్రీల సెల్సియస్‌లు పెరిగే అవకాశం ఉంది. తూర్పు, మధ్య, దక్షిణ భారతదేశంలో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఐఎండి చెప్పింది. వచ్చే 4 రోజులలో పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో వేడి గాలులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. మహారాష్ట్రలో రాబోయే మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రత 2-3 డిగ్రీలు పెరుగుతుందని IMD తెలిపింది. ఆదివారం జరిగిన మహారాష్ట్ర భూషణ్ అవార్డు కార్యక్రమంలో 13 మంది వడదెబ్బతో మృతి చెందారు.
పంజాబ్, హర్యానా, బీహార్, ఆంధ్ర ప్రదేశ్ లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. హర్యానా , పంజాబ్‌లోని చాలా ప్రాంతాల్లో ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదయ్యాయి. పంజాబ్‌లోని భటిండాలో గరిష్ట ఉష్ణోగ్రత 41.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. పశ్చిమ బెంగాల్‌లో నాలుగు రోజుల పాటు తీవ్రమైన వడగాలులు ఉంటాయన్న ఐఎండి హెచ్చరికతో రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలను శనివారం వరకు మూసివేయాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశించారు. రాష్ట్రంలో వేడిగాలుల వంటి పరిస్థితుల కారణంగా ఏప్రిల్ 18 నుండి 23 వరకు అన్ని ప్రభుత్వ, రాష్ట్ర సహాయ పాఠశాలలను మూసివేయనున్నట్లు త్రిపుర తెలిపింది. గతంలో ఒడిశా కూడా ఇదే ఆదేశాలను జారీ చేసింది.