వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అంటేనే ఓ ఫైర్ బ్రాండ్. మహిళలకు ఆమె ఒక రోల్ మోడల్. రాజకీయంగా, సినిమాపరంగా రోజాకు అశేషమైన అభిమానగణం ఉంది. సినిమాల్లో కష్టాలను ఒంటి చేత్తో ఎదుర్కొన్న రోజా నిజజీవితంలోనూ అవే కష్టాలను ఎదుర్కొవాల్సి వస్తోంది. సినిమాపరంగా ఆమె కెరీర్ ఎలాంటి చీకుచింత లేకుండా సాగిపోయింది. కానీ రాజకీయంగా మాత్రం ఆమె ఆధిపత్య పోరులో నలిగిపోతున్నారనే టాక్ విన్పిస్తోంది. ఆమెను ప్రత్యర్థి పార్టీల నేతలే కాకుండా సొంత పార్టీ నేతలు టార్గెట్ చేస్తున్నారని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. తాజాగా రోజాకు రోజుకో సమస్య వచ్చిపడుతోందట..
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే రోజాకు మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో ఆమెకు ఆ పదవి దక్కకుండా పోయింది. సొంత పార్టీల నేతలే ఆమెకు ఆ పదవీ దక్కకుండా చేశారనే టాక్ ఉంది. ఈక్రమంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఆమెకు కీలకమైన ఏపీఐఐసీ పదవిని కట్టబెట్టారు. అయితే ఇటీవల నామినేటెడ్ పదవుల పంపకంలో భాగంగా రోజాను ఏపీఐఐసీ పదవి తప్పించి వేరొకరికి అవకాశం కల్పించారు దీంతో రోజాకు అన్యాయం జరిగిందని ఆమె అభిమానులు వాపోతున్నారు.
రోజా మాత్రం తనకు సీఎం జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తారనే ధీమా వ్యక్తం చేస్తుండటం విశేషం. ఎక్కడా తనకు జరిగిన అన్యాయంపై బహిరంగంగా ఆమె విమర్శలు చేసిన దాఖలాల్లేవు. మరోవైపు సొంత పార్టీలోనే రోజాకు వ్యతిరేక వర్గం తయారైంది. గత పంచాయతీ, కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ విషయం బహిర్గతమైంది. రోజాను ఒంటరి చేయాలని లక్ష్యంగా కొంతమంది ఆ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థులను బరిలో దింపారు. అయితే వాటన్నింటిని ఆర్కే రోజా సమర్ధవంతంగా తిప్పికొట్టి తన అభ్యర్థులను గెలిపించుకున్నారు.
తాజాగా జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హవా కొనసాగించింది. రోజా సొంత నియోజకవర్గంలో నగరిలోనూ వైసీపీ స్పష్టమైన మెజార్టీని సాధించింది. అయితే మంత్రి పెద్దారెడ్డి అనుచరుడిగా ఉన్న చక్రపాణి రెడ్డి రోజాకు కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాడనే టాక్ నియోజకవర్గంలో నడుస్తోంది. నగరిలోని నిండ్ర మండలంలో చక్రపాణి రెడ్డిదే హవా కొనసాగుతోంది. దీంతో ఇక్కడ ఎంపీపీ పదవిని రోజా వర్గానికి దక్కకుండా ఆయన పావులు కదుపుతున్నారట.. వీరివురి మధ్య రాజకీయం తారాస్థాయికి చేరింది. ఇందులో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
నగరిలోని విజయాపురం మండలంలో ఎంపీపీ అభ్యర్థి ఎన్నికలో మొదలైన ఆధిపత్యపోరు నిండ్ర మండలంలో తారస్థాయికి చేరింది. విజయాపురం ఎంపీపీగా రాజుల వర్గానికి చెందిన లక్ష్మీపతి రాజును అభ్యర్థిగా పార్టీవర్గాలు భావించాయి. తరతరాలుగా వస్తున్న ఈ ప్రతిపాదనకు ఆర్కే రోజా అడ్డుకట్ట వేశారు. ఇక్కడ ఓ దళిత మహిళను ఎంపీపీగా చేయాలని భావించారు. తాను ప్రతిపాదించిన జమునను ఎంపీపీగా గెలిపించుకొని సత్తాచాటారు. అయితే నిండ్రలో మాత్రం రోజా అనుకున్నట్లుగా జరుగడం లేదని తెలుస్తోంది.
నిండ్రలో ఎంపీపీ పదవికి ఎమ్మెల్యే రోజా దీపా అనే అభ్యర్థిని ఎంపిక చేశారు. ఇదే సమయంలో ప్రస్తుతం శ్రీశైలం బోర్డు చైర్మన్ గా ఉన్న చక్రపాణి రెడ్డి తన తమ్ముడు భాస్కర్ రెడ్డిని ఎంపీపీగా చేయాలని భావిస్తున్నాడు. ఈక్రమంలోనే ఆయన ఐదుగురు ఎంపీటీసీలతో కలిసి క్యాంపు రాజకీయానికి తెరలేపాడు. దీంతో నిన్న జరగాల్సిన ఎన్నికలకు ఐదుగురు ఎంపీటీసీలు గైర్హాజరయ్యారు. ఈక్రమంలోనే ఎమ్మెల్యే రోజా స్వయంగా రంగంలోకి దిగి కోఆప్షన్ మెంబర్ గా అనిల్ కుమార్ ను ఎంపిక చేసుకున్నారు. అయితే ఎంపీపీ ఎన్నిక మాత్రం వాయిదా పడింది.
నేడు జరగాల్సిన ఎంపీపీ ఎన్నికలోనూ చక్రపాణి వర్గీయులు రోజాకు అడ్డుపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా భాస్కర్ రెడ్డిని ఎంపీపీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో మరోసారి నగరిలో ఆధిపత్య పోరు తెరపైకి వచ్చింది. ఈక్రమంలోనే రోజా తాను కోరుకున్న అభ్యర్థినే ఎంపీపీగా గెలిపించుకుంటారా? లేదా అన్నది సందేహంగా మారింది. రోజా అభిమానులు మాత్రం పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల మాదిరిగానే తన వ్యతిరేక వర్గానికి ఎంపీపీ ఎంపిక విషయంలోనూ షాకిస్తుందని అంటున్నారు. చూడాలి మరీ రోజా తన పంతం ఏమేరకు నెగ్గించుకుంటారో..!