ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్నందున రాజకీయ పార్టీలు ఓట్ల వేటలో పడ్డాయి. ప్రధాన పార్టీలైన బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీలు కుల రాజకీయాలలో బిజీగా ఉన్నాయి. కుల ప్రాతిపదిక ఏర్పడిన చిన్న పార్టీల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నిస్తున్నాయి. వాటితో పొత్తు పెట్టుకుని 2022 అసెంబ్లీ పోరుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఉత్తర ప్రదేశ్‌లో మహిళా ఓటర్లపై దృష్టి కేంద్రీకరించారు. గత కొన్ని నెలల నుంచి మహిళా ఓటర్లే లక్ష్యంగా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అంతేకాదు, మహిళల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ హస్తం పార్టీ ఎన్నికల ప్రణాళిక రూపొందించింది.
మొత్తం రాష్ట్ర ఓటర్లలో సగ భాగమైన మహిళలను భారీగా సమీకరించాలని ప్రియాంక టార్గెట్‌గా పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగానే ఆమె తన రాజకీయ కార్యక్రమాలు..ప్రచార కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఇటీవల ఆమె యూపీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేశారు. మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ రూపొందించిన హస్తం ఎన్నికల ప్రణాళికను మీడియా “పింక్ మ్యానిఫెస్టో”గా అభివర్ణిస్తోంది. కాగితంపై చూస్తే కాంగ్రెస్ వ్యూహం బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో ఎస్పీ సాంప్రదాయ ఓటు బ్యాంకు యాదవులు కాగా..బీఎస్సీకి దళిళులు అండగా ఉన్నారు. కానీ ఏ అండా లేనిది కాంగ్రెసే. దానికి ప్రస్తుతం యూపీలో ఓటు బ్యాంకు పునాది ఏదీ లేదు. తనకంటూ కొత్తగా ఓటు బ్యాంకు సృష్టించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు ప్రియాంక మహిలలను తన ఓటు బ్యాంకుగా ఎంచుకున్నారు.
ప్రియాంకా గాంధీ పింక్ మ్యానిఫెస్టో పూర్తిగా మహిళల కోసం ఉద్దేశించిన ఎన్నికల ప్రణాళిక. ఇందులో ఆరు సెక్షన్లు ఉన్నాయి. మహిళల ఆత్మగౌరవం, గౌరవం, స్వావలంబన, విద్య, భద్రత, ఆరోగ్యం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 12వ తరగతి బాలికలకు స్కూటర్, మొబైల్ ఫోన్, ఆశా వర్కర్ల జీతం 10,000 కు పెంచాలని ప్రతిపాదించింది. అన్నిటికి మించి ఈ ఎన్నికల్లో 40శాతం మంది మహిళా అభ్యర్థును బరిలో దించుతామని ప్రియాంక గాంధీ గతంలోనే ప్రకటించారు.
ఐతే, కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఎన్ని ప్రతిపాదనలు చేసినా.. .ప్రకటనలు ఇచ్చినా అవి కాంగ్రెస్ పార్టీకి తక్షణం లాభించవు. 2022 ఎన్నికల్లో దానికి అద్భుత విజయాలు తెచ్చిపెట్టవు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండటమే దీనికి కారణం. 2009 లోక్‌సభ ఎన్నికలు మినహా ఇప్పటి వరకు జరిగిన ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓట్ల శాతం రెండు అంకెలకు చేరలేదు. 2017 అసెంబ్లీ ఎన్నికలలో ఎస్పీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ 6.2 శాతం ఓట్లు సాధించింది. 2019 లోక్‌సభ ఎన్నికలలో అది 6.3 శాతంగా ఉంది. 2014 లోక్‌సభ ఎన్నికలలో దాని ఓట్ల శాతం 7.4 మాత్రమే. వరుస ఎన్నికలలో ఇటువంటి పేలవ ప్రదర్శనల తర్వాత ఏ పార్టీ కూడా రాత్రికి రాత్రి పుంజుకోదు..అది అసాధ్యం.
అయితే, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రకటనలు దానికి సత్వర ఫలితాలు ఇవ్వకపోవచ్చు కానీ అవి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. రాజకీయాల పట్ల మహిళా ఓటర్లకు ధృడమైన అభిప్రాయాలున్నాయి. కానీ వాటి గురించి ప్రజాక్షేత్రంలో తక్కువగా మాట్లాడుతున్నారు. దేశ రాజకీయాల స్వరూపాన్ని కూడా మార్చే సత్తా మహిళా ఓటర్లకు ఉంది. ఎన్నికల్లో పోటీ చేయాలని, మహిళా అభ్యర్థులకు ఓటు వేయాలని దేశంలోని మెజార్టీ మహిళలు కోరుకుంటున్నారు. కాబట్టి, భవిష్యత్‌లో మహిళలకు ఎక్కువ టిక్కెట్లు ఇవ్వడానికి పార్టీలు ప్రణాళిక రూపొందించుకోవాలి.
సమాన అర్హతలు కలిగిన పురుషుడు, మహిళ ఎన్నికల బరిలో నిలిచినపు మెజార్టీ స్ర్తీలె మహిళా అభ్యర్థినే బలపరుస్తామని అంటున్నారు. సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్‌డీఎస్) దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో నూటికి 58శాతం మంది మహిళలు ఈ మాటే అంటున్నారు. అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసే పురుష అభ్యర్థికి కేవలం 12 శాతం మంది మహిళా ఓటర్లు మాత్రమే ఓటేస్తామని వెల్లడించారు. గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలో అన్ని వయస్సుల స్త్రీలు ఈ అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు.
కాబట్టి, 40 శాతం మహిళలకు టిక్కెట్లు ఇవ్వాలనే కాంగ్రెస్ నిర్ణయం దాని ఓటు బేస్ పెరగటంలో సహాయపడవచ్చు. ఐతే, పోటీలో నిలవాలంటే ఇది మాత్రమే సరిపోదు. 28 శాతం మంది భారతీయ మహిళలు రాజకీయాల్లో కెరీర్‌ను కొనసాగించాలనుకుంటున్నారని అధ్యయనాలు అంటున్నాయి. ఈ అభిప్రాయం స్థానిక మహిళలో, సోషల్ గ్రూపులలోని స్త్రీలలో ఎక్కువగా వ్యక్తమవుతోంది. చిన్న పట్టణాల్లో నివసించే వారి కంటే పెద్ద నగరాల్లో నివసిస్తున్న మహిళలు రాజకీయాల్లో చేరడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. గణనీయమైన సంఖ్యలో గ్రామీణ మహిళలు కూడా రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు.
ఐతే, ప్రస్తుత భారతీయ మహిళ ఎందుకు మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటోంది? పురుషుల కంటే మహిళా అభ్యర్థికి ఓటు వేయడానికి ఇష్టపడటానికి కారణం ఏమిటి? మహిళా శాసనసభ్యులు పురుషుల కంటే మహిళల ప్రయోజనాలను బాగా చూసుకోగలరని వారి బలమైన నమ్మకం. 2019 లోక్ సభ ఎన్నికల్లో అధిక సంఖ్యలో మహిళా అభ్యర్థులు ఎన్నికయ్యారు. వారిలో ఎక్కువ మంది తృణమూల్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్‌కు చెందినవారు. ఈ రెండూ గణనీయమైన సంఖ్యలో మహిళా అభ్యర్థులను బరిలో దించాయి.
ఐతే, ప్రస్తుత లోక్‌సభలో గతంలో కన్నా ఎక్కువ మంది మహిళలు ఉన్నందున ప్రభుత్వంలో మహిళల సమస్యలకు సంబంధించిన చర్చ కానీ, వారికి సంబంధించిన చట్టాల విషయంలో ఏదైనా మార్పు కనిపించిందా లేదా అనేదానిని అంచనా వేయటం కష్టమే. అయితే మహిళా ప్రజాప్రతినిధులు స్ర్తీల ప్రయోజనాల కోసం పురుషుల కంటే మెరుగ్గా కృషి చేస్తారనే నమ్మకం మహిళా ఓటర్లలో ఉంది. పార్లమెంటు, అసెంబ్లీలలో పురుషుల కంటే మహిళలు మెరుగ్గా ఉన్నారు. అద్యయనంలో 47 శాతం మంది మహిళా ఓటర్లు ఈ అభిప్రాయంతో ఉన్నారు. 14 శాతం మంది ఈ వాదనతో ఏకీభవించలేదు.
జాతీయ, రాష్ట్ర చట్టసభల్లో మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉండటం వల్ల దేశంలో సానుకూల మార్పు వస్తుందని మహిళా ఓటర్లలో ఒక అభిప్రాయం ఉంది. అంతేకాకుండా మహిళల సమస్యలపై పార్లమెంటు, అసెంబ్లీల దృష్టిని ఆకర్షించడంలో ఇది సహాయపడుతుంది. పార్లమెంట్‌లో మహిళల సంఖ్య తక్కువగా ఉండటంతో మహిళలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సమస్యలపై సరైన శ్రద్ధ చూపడం లేదు.
కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం 2022 యూపీ ఎన్నికల్లో దానికి పెద్దగా ఫలితాలు అందించకపోవచ్చు, కానీ మహిళల పట్ల ఓ సానుకూల ఎజెండాను సెట్ చేసిందని మాత్రం ఖచ్చితంగా చెప్పవదచ్చు. రాజకీయ పార్టీలు ఈ సమస్యలను గమనించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఒడిశాలోని బీజేడీ, బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ చొరవ తీసుకుని 2019 లోక్‌సభ ఎన్నికలలో పెద్ద సంఖ్యలో మహిళా అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చాయి. వారిలో చాలా మంది గెలిచారు. బీజేడీ, టీఎంసీలను అనుసరిస్తోందని అర్థమవుతోంది. ఇతర రాజకీయ పార్టీలు కూడా ఇదే బాటలో నడుస్తాయో లేదో అన్నది భవిష్యత్ తేలుస్తుంది.
2017 అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఉత్తరప్రదేశ్‌లో పద్నాలుగు కోట్ల పన్నెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో ఏడు కోట్ల అరవై ఎనిఇమది లక్షల మంది పురుషులు కాగా ఆరు కోట్ల నలబై నాలుగు లక్షల మంది మహిళా ఓటర్లున్నారు. కాబట్టి ఆరున్నర కోట్ల మహిళా ఓటర్లలో ఎంతమంది మనసులను హస్తం పార్టీ గెలుచుకుంటుందో చూడాలి.
-Dr.Ramesh Babu Bhonagiri