పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై విచారణ జరుగుతోంది. బస్సు ప్రమాద ఘటనకు కారణాలను తెలుసుకుంటున్నాం అన్నారు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. బస్సు 20 మీటర్ల దూరం నుండి అదుపు తప్పింది అంటున్నారు. బస్సులో 47 మంది ఉన్నారు. 9 మంది చనిపోయారు. డ్రైవర్ కి హార్ట్ స్ట్రోక్ అని ప్రచారం జరుగుతుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగానే వాస్తవాలు తెలుస్తాయన్నారు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. ఎదురుగా వచ్చిన బైక్‌ని తప్పించబోయి బస్సు వాగులో పడిపోయింది.
బస్సు ప్రమాదం జరిగిన ప్రదేశంలో గతంలో లారీ బోల్తా పడింది. జల్లేరు వాగుపై అప్పట్లోనే ధ్వంసం వంతెన రైలింగ్ ధ్వంసం అయింది. అయినా ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోలేదు. ఆ వంతెన రైలింగ్ ఉండి ఉంటే ప్రమాద తీవ్రత ఈస్థాయిలో ఉండేది కాదంటున్నారు స్థానికులు. 12 30 గంటలకు బస్సు ప్రమాదం జరిగిందని, గజ ఈతగాళ్లతో స్పాట్ కి చేరుకున్నామని అగ్నిమాపక శాఖ అధికారులు ఎన్టీవీతో చెప్పారు. 8 మంది డెడ్ బాడీలను అప్పటికప్పుడు వెలికితీశామని, క్షతగాత్రులను వెంటనే వాగు నుండి బయటకు తీసుకు వచ్చామన్నారు. బస్సును 3 క్రేన్‌లతో వెలికి తీశామన్నారు.
బస్సు కింద ఇంకెవరైన ఉన్నారా అని చెక్ చేశామని, 100 మీటర్ల పరిధి వరకు డైవ్ చేసి చెక్ చేసామన్నారు అగ్నిమాపక అధికారులు. బస్సు కింద ప్రాంతంలో ఇంకెవరు లేరన్నారు. 20 అడుగుల ఎత్తు నుండి జల్లేరు వాగులో బస్సు పడింది. దీంతో పల్లె వెలుగు బస్సు మొత్తం ధ్వంసం అయింది. రక్తం మరకలతో దర్శనం ఇస్తోంది బస్సు. అతి కష్టం మీద మూడు క్రేన్ లతో 4 గంటల పాటు శ్రమించి బస్సును బయటకి తీశారు అధికారులు.
బస్సు బోల్తా పడగానే ప్రాణాలతో బయట పడ్డానని, కళ్ళ ముందే ప్రయాణికులు చనిపోయారని ప్రత్యక్ష సాక్షి ఆవేదన వ్యక్తం చేశారు. బస్ షేక్ అవుతూ ముందుకు వెళ్ళింది. ప్రమాద ఘటనకు ముందు బస్సులో వున్న 47మంది అరుస్తూ కేకలు వేశారు. కళ్ళ ముందు ముసలి అవ్వ కాపాడండి అంటూ చనిపోయిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం బాధాకరంగా ఉంది. ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అన్నారు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ.