ఏపీలో సినిమా టిక్కెట్ల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. రేపు ‘పుష్ప’ సినిమా విడుదల నేపథ్యంలో టిక్కెట్ల రేట్ల విషయంలో గందరగోళం నెలకొంది. గతంలో ఉన్న కమిటీలో లోటు పాట్లను సరిచేసి కొత్త కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు చేసిన విషయం తెలిసిందే. టిక్కెట్ల ధరల జాబితాను జాయింట్ కలెక్టర్‌కు పంపించాలని థియేటర్ యజమానులకు కూడా హైకోర్టు సూచించింది. టిక్కెట్ల ధరలకు అనుగుణంగా పన్నులు చెల్లించాలని కూడా హితవు పలికింది. నాలుగు షోలు మాత్రమే ప్రదర్శించాలని ఆదేశించింది.
Read Also: EMK: టీఆర్పీల్లో తుస్సుమన్న పూనకాల ఎపిసోడ్
అయితే తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా పాత పద్ధతిలోనే టికెట్ల విక్రయం, అదనపు షోలు వేసుకోవచ్చని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో చిన్న మెలిక కనిపిస్తోంది. కోర్టులో పిటిషన్ వేసిన వారికే ఈ తీర్పు వర్తిస్తుందని న్యాయస్థానం తెలిపింది. దీని ప్రకారం ఉత్తరాంధ్ర, తూ.గో. జిల్లాల్లోని 225 థియేటర్లకు తీర్పు వర్తిస్తుంది. అలాగే గుంటూరు జిల్లా తెనాలిలో 4 థియేటర్లు, చోడవరంలో ఒక థియేటర్ పాత పద్ధతిలో షోలు వేసుకోవచ్చు. రాష్ట్రంలోని మిగతా థియేటర్లకు మాత్రం ప్రభుత్వం జారీ చేసిన జీవో 35 వర్తిస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ స్పష్టం చేశారు. కోర్టుకెళ్లిన కొంతమంది పిటిషనర్లకు మాత్రమే మినహాయింపు ఆదేశాలు వర్తిస్తాయన్నారు. టిక్కెట్ ధరలకు సంబంధించి ఎలాంటి కమిటీలు నియమించే అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.