తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ తెలుగు నిర్మాతలందరినీ అక్టోబర్ వరకూ తమ చిత్రాలను ఓటీటీలో విడుదల చేయవద్దంటూ కొంతకాలం క్రితం కోరింది. కానీ వారి మాటను కాదని ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు ‘నారప్ప’ చిత్రాన్ని ఓటీటీలోనే విడుదల చేశారు. తాజాగా నాని సినిమా ‘టక్ జగదీశ్’ సైతం అతి త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోందని వార్తలు వచ్చాయి. విశేషం ఏమంటే… నాగ చైతన్య హీరోగా నటించిన ‘లవ్ స్టోరీ’ మూవీని ఆ చిత్ర నిర్మాతలు దాదాపు మూడు మాసాలు వేచి ఉండి, సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. సరిగ్గా అదే రోజున నాని ‘టక్ జగదీశ్’ సైతం ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోందన్నది తాజా సమాచారం. ‘థియేటర్లంటే ప్రాణమని, థియేటర్లలో ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటంలోనే మజా ఉంటుంద’ని మొన్నటి వరకూ చెప్పిన నాని… ఇప్పుడు ఠక్కున యూ టర్న్ తీసుకుని తన సినిమాను ఓటీటీలో ప్రసారం చేయించడానికి అంగీకరించడంపై తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గం అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. పైగా థియేట్రికల్ రిలీజ్ కోసం ‘లవ్ స్టోరీ’ని ఇన్ని నెలల పాటు హోల్డ్ చేసి, ఇప్పుడు రిస్క్ తీసుకుని విడుదల చేస్తుంటే, అదే రోజున నాని తన సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడం ఎంతవరకూ భావ్యమని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఒక సినిమాను మరో సినిమా ఇలా కిల్ చేయడం ఎంతవరకూ సమంజసమని అడుగుతున్నారు.
‘టక్ జగదీశ్’ సినిమా విడుదలపై తుది నిర్ణయం నిర్మాతలదే అని నాని చెప్పినా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కన్వెన్స్ కావడం లేదు. దాంతో నానితో ఇప్పుడు సినిమాలు తీస్తున్న నిర్మాతలకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. నాని ‘టక్ జగదీశ్’ మూవీ సెప్టెబర్ 10నే ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే మాత్రం… సెట్స్ పై ఉన్న నాని సినిమాల విడుదల విషయంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాన్ కోపరేషన్ వైఖరిని అవలంభించే ఆస్కారం ఉంది. ఈ విషయమై నిర్ణయాన్ని తీసుకుని, మీడియాకు తెలియచేస్తుందని అంటున్నారు. మరి నాని, అతని చిత్ర నిర్మాతలు… ఈ వివాదాలకు ముగింపు పలుకుతూ, ‘టక్ జగదీశ్’ను థియేటర్లలోనే రిలీజ్ చేస్తారో, లేదంటే కనీసం కొంతకాలం ఆగి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయిస్తారో చూడాలి.