కలియుగ వైకుంఠం తిరుమల వెళ్ళే భక్తులకు టీటీడీ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. రెండవ ఘాట్ రోడ్డులో రాకపోకలు పునరుద్ధరించారు. రెండవ ఘాట్ రోడ్డులో పూర్తిస్థాయిలో వాహనాల అనుమతి ప్రారంభించింది టీటీడీ. జెండా ఊపి వాహనాలను అనుమతించారు అదనపు ఇఓ ధర్మారెడ్డి. రెండవ ఘాట్ రోడ్డు ప్రారంభం కావడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాది వర్షాల వల్ల ఘాట్ రోడ్లు దెబ్బతిన్నాయి. డిసెంబర్ 1వ తేదిన 16వ కిలోమీటర్ వద్ద కొండచరియలు విరిగిపడడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. డిసెంబర్ 4వ తేదీ వరకు మొదటి ఘాట్ రోడ్డులోనే వాహనాల రాకపోకలు సాగాయి. డిసెంబర్ 5 వ తేదీ నుంచి రెండవ ఘాట్ రోడ్డులో వాహనాలను లింక్ రోడ్డు మీదుగా మళ్ళించారు. లింక్ రోడ్డు మళ్ళింపు కారణంగా ప్రయాణ సమయం పెరిగిపోయింది. ఎట్టకేలకు మరమ్మతులు పూర్తయ్యాయి. 80 శాతం పనులు పూర్తి చేసి రెండవ ఘాట్ రోడ్డులో వాహనాలను అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. సంక్రాంతి నాటికి వాహనాలను అనుమతిస్తామని ఇంతకుముందే హామీ ఇచ్చారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. పనులను వేగవంతం చేయడంతో వాహనాల రాకపోకలకు ఆటంకాలు తొలగిపోయాయి.