ఢిల్లీ లో టీ ఆర్ ఎస్ ఎంపీ లు కడుపు లో పేగులు తెగే దాకా కొట్లాడారని, కాంగ్రెస్ బీజేపీ ఎంపీ లు కొట్లాడకున్నా టీ ఆర్ ఎస్ ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ రామారావు. వాళ్లు మనుషులా పశువులా? బీజేపీ ఎంపీ పశువులా మమ్మల్ని బియ్యం స్మగ్లర్లు అంటున్నాడు. ఇలాగేనా రాజకీయాలు చేసేది. మేం జవాబు దారీ అంటే అదీ తెలంగాణ ప్రజలకే.. ఢిల్లీ కి గుజరాత్ లకు మేము గులాంలు కాదు.
సోనియా గాంధీకి మోడీకి భయపడే వాడు ఇక్కడ ఎవ్వడూ లేడు. భయపడితే మిగతా పార్టీ ల వాళ్ళు భయపడుతుండొచ్చు. పీసీసీ చీఫ్ చీప్ గా మాట్లాడుతున్నాడు. సచివాలయం లో నేల మాళిగలు ఉన్నాయని పిచ్చోడిలా మాట్లాడిన వ్యక్తి పీసీసీ అధ్యక్షుడు అయ్యాడు. 50 కోట్ల రూపాయలు లంచమిచ్చి పీసీసీ తెచుకున్నాడని కోమటి రెడ్డే ఆరోపించాడు. ఒకడు బియ్యంలో 3 వేల కోట్ల స్కాం అంటాడు. మరొకడు వ్యాక్సిన్లలో 10 వేల కోట్ల స్కాం అంటాడు. ఏదిపడితే మాట్లాడే వాడికి నెత్తి లేదు కత్తి లేదు. బండి సంజయ్ తొండి సంజయ్ లా మారారు.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సంజయ్ కు క్లాస్ పీకానని మాతో స్వయంగా చెప్పారు. కేంద్రం తప్పిదాల వల్లే ధాన్యం కొనుగోలు సమస్య వచ్చిందన్నారు కేటీఆర్. ఉప్పుడు బియ్యం కొనమని కేంద్రం చెప్పడం వల్లే సమస్యలు వచ్చాయి. కేంద్రానిది దున్న పోతు మీద వాన పడ్డా స్పందన లేని వైఖరి. కర్ణాటక అప్పర్ భద్ర ప్రాజెక్టు కు జాతీయ హోదా ఇస్తారు కానీ తెలంగాణ ప్రాజెక్టులకు ఇవ్వరా? బీజేపీ తెలంగాణ కు ఏం పీకిందని ఉద్యమ కారులు ఆ పార్టీ లో చేరతారు.
హిందూ ముస్లిం బాబర్ అక్బర్ తప్ప బీజేపీ కి ఏం తెలుసు? బీజేపీ ఉడత ఊపులకు భయపడే వారు ఎవ్వరూ లేరు. అరెస్టులు చేస్తామని బెదిరిస్తే భయపడే వారు ఎవ్వరూ లేరని ఘాటుగా వ్యాఖ్యానించారు కేటీఆర్. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం. మేం ఎవరికీ బానిసలం కాదు. తెలంగాణకే బానిసలం అన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.