టీఆర్‌ఎస్ నేత, ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటారు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ చర్చకు దారితీస్తున్నాయి. ఇంతకుముందు తన పర్యటనల్లో ప్రభుత్వ అధికారులపై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ఉద్యోగం చేస్తారా ఇంటికెళతారా అని మండిపడ్డారు. తాజాగా పార్టీలోని కొందరు నేతల్ని ఆయన టార్గెట్ చేశారు.

నేను గ్రామాల్లో పర్యటించినప్పుడు పక్కా టీఆర్‌ఎస్‌లో కొనసాగే నాయకులు మాత్రమే పాల్గొనండి. రెండో ఆలోచన చేసేవారికి ఇక నుంచి ఫోన్లు రావు. పినపాక టీఆర్‌ఎస్ లో వుండే ప్రజాప్రతినిధులు గ్రామాల్లో సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. రాజకీయాల సంగతి నేను చూసుకుంటా. అభివృద్ధి నేను చూసుకుంటా. బాధ్యతలు తీసుకున్న మండల నాయకులు గ్రామాల్లో పర్యటించండి. సమస్యలు గుర్తించండి.

మనకు మాజీ ఎమ్మెల్యేతోనే పోటీ వుంటుంది. ఎటువంటి సందేహం లేదు. హ్యాట్రిక్ సాధించేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధపడండి. పోటీదారుని పార్టీ ఏదైనా కావచ్చు. గెలిచేది టీఆరెస్సే మనమే. శత్రువులు ఎన్ని పన్నాగాలు పన్నినా పినపాక ప్రజలు న్యాయాన్ని మాత్రమే గెలిపిస్తారు. మనపై నమ్మకం ఉంచారు. వారి నమ్మకాన్ని వమ్ముచేయను. వచ్చేది టీఆర్‌ఎస్ ప్రభుత్వమే. మోసగాళ్ళ మాటలు హరికథల్లా వుంటాయి. ప్రజాక్షేత్రంలో వారికి ఓటమి తప్పదు. మన నాయకునిపై నమ్మకం లేని వాళ్ళు చెప్పే మాటలు నమ్మొద్దు. వ్యక్తిగత స్వార్థం కోసం ఏదైనా చెబుతారు.. అంటూ వరుస ట్వీట్లతో రేగా రచ్చ రేపారు. ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో, టీఆర్‌ఎస్ పార్టీలో హాట్ టాపిక్ అవుతున్నాయి.