దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై మళ్లీ టోల్ బాదుడు మొదలైంది. పెరిగిన ఛార్జీలు శుక్రవారం అర్థరాత్రి నుంచే టోల్ ప్లాజాల వద్ద అమలులోకి వచ్చాయి. ఏప్రిల్ 1వ తేదిన నుంచి టోల్ ఛార్జీలు భారీగా పెంచేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా( ఎన్ హచ్ఏఐ) నిర్ణయం తీసుకుంది. ఆ నేపథ్యంలో పెరిగిన టోల్ చార్జీలు శుక్రవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రతీ ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో టోల్ ఛార్జీలను సమీక్షిస్తుంటారు. ఇందులో భాగంగానే ఈసారి కూడా టోల్ ఛార్జీలు పెంచనున్నారు.
ఈ ఏడాది 5 నుంచి 10 శాతం వరకు ఛార్జీలు పెంచుతున్నట్లు ఎన్ హెచ్ఏఐ అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టోల్ ప్లాజాల్లో పెరిగిన ఛార్జీలు అమలులోకి వచ్చాయి. జాతీయ రహదారులపై తిరిగే అన్ని రకాల వాహనాలకు కొత్త ఛార్జీలను వసూలు చేస్తున్నారు. సింగిల్, డబుల్ ట్రిప్‌లతోపాటు నెలవారీగా జారీ చేసే పాసుల్లోనూ ఈ పెంపు ఉంటుంది.
కాగా, ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలతోపాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో సామాన్యుడి జీవితం పెను భారం పడుతోంది. ఇప్పుడు టోల్ ఛార్జీలు కూడా పెరగడంతో సామాన్యుడి జేబులకు చిల్లు పడడం ఖాయం.