హైదరాబాద్ కేపీహెచ్‌బీ ఫేజ్-4లో విషాదం నెలకొంది. ఆడుకుంటూ సెల్లార్ గుంతలో పడి ముగ్గురు బాలికలు మృతిచెందారు. మృతులు రమ్య(7), సంగీత(12), సోఫియా(10)గా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే… కట్టెల పొయ్యి పెట్టుకుని వంట చేస్తున్నట్లు ఆడుకుంటున్న ఐదుగురు చిన్నారులు.. నీటి కోసమని సెల్లార్ గుంత వద్దకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తూ గుంతలో సోఫియా, రమ్య, సంగీత పడిపోయారు. ఈత రాకపోవడంతో బయటకు రాలేక చిన్నారులు ఊపిరాడక మునిగిపోయారు. ఒడ్డున ఉన్న ఇద్దరు చిన్నారులకు ఏం చేయాలో తోచక భయంతో ఇంటికి పరుగులు తీశారు.
Read Also: స్కార్పియోలో మంటలు.. తప్పిన ప్రమాదం
ఇద్దరు చిన్నారులు ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని చూడగా.. నీటిలో అప్పటికే ఓ బాలిక మృతదేహం తేలుతూ కనిపించింది. వాళ్లు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాలికల మృతదేహాలను వెలికి తీశారు. అయితే ఓ భవనం నిర్మాణం కోసం ఈ గుంత తవ్వారని.. ఆ గుంతే ముగ్గురు చిన్నారులను బలిగొందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని మృతదేహాల తరలింపును అడ్డుకున్నారు. దీంతో కేపీహెచ్‌బీ-4లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.