ఇటీవల ఇంటర్ ఫస్టియర్ ఫలితాలను ఇంటర్ బోర్డ్ అధికారులు విడుదల చేశారు. అయితే ఈ ఫలితాలలో 51 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. టాప్ ర్యాంక్ విద్యార్థులు కూడా పాస్ కాకపోవడం గమనార్హం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికీ పలువురు విద్యార్థులు ఫెయిల్ అయ్యామనే మనస్థాపంతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో విద్యార్థి సంఘాలు ఇంటర్ బోర్డు, విద్యాశాఖ తీరుపై నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి.
అయితే విద్యాశాఖ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. గత సంవత్సరం లాక్‌డౌన్, ఆన్లైన్ క్లాసులతో విద్యాబోధన సరిగ్గా జరగని కారణంగా విద్యార్థులకు సిలబస్‌లో విద్యా శాఖ కూడా మార్పులు చేసింది. అయినప్పటికీ విద్యార్థులు 51 శాతం ఫెయిల్ అవడంతో కనీస మార్కులు 35 శాతం వేసి ఫెయిలైన విద్యార్థులను పాస్ చేసే ఆంశాన్ని విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఇంటర్ ఫలితాలపై నేడు విద్యార్థి సంఘాలు కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు నిరసనలు తెలుపనున్నాయి.