తెలంగాణలో జరిగిన ఒక ఉప ఎన్నిక జాతీయ పార్టీ కాంగ్రెస్ ని కుదిపేస్తోంది. పార్టీ పరాజయం నేతల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. గత నెల 30 జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆ పార్టీకి అక్కడ డిపాజిట్లు గల్లంతయ్యాయి. పార్టీ పరువు పోయిందని సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నేతలు సైతం ఎన్నికల ఫలితాల తర్వాత పోస్టుమార్టం చేశారు.
హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు ఓటు వెయ్యం అని జనం డైరెక్ట్‌గా చెప్పారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ఎంతో సమయం వున్నా… అభ్యర్ధి విషయంలో చివరి వరకూ తాత్సారం చేశారని సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అభిప్రాయంతో వున్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి.
హుజురాబాద్‌లో కనీసం 40 వేల ఓట్లయినా వస్తాయని రేవంత్ సహా నేతలంతా భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. 40 వేలు కాదు కదా కనీసం 4 వేలయిన ఓట్లు రాలేదు. హుజురాబాద్ లో మొత్తం 2,37,036 ఓట్లు కాగా..ఇందులో 2,05,236 పోలయ్యాయి. ఇందులో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు 1,07,022 పోలయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు 83,167 ఓట్లు పోలయ్యాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ 3,014 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఒక జాతీయ పార్టీకి అంత తక్కువ ఓట్లు రావడంతో కాంగ్రెస్ నేతల మైండ్ బ్లాంక్ అయింది.
దీంతో సీనియర్లు నష్టనివారణ ప్రారంభించారు. హుజురాబాద్ పరాజయంపై అంతర్గత విచారణ జరిపామన్నారు మాజీ ఎంపీ, సీనియర్ నేత వి.హనుమంతరావు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఎక్కడికి పోయిందని ఆయన ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కి చాలా రోజులుగా దూరంగా ఉంటున్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వారికి నచ్చ జెప్పే బాధ్యత విహెచ్‌కి అప్పగించింది కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ. ఈనేపథ్యంలో సీనియర్ నేతలు పార్టీకి దూరంగా ఉండడం మంచిది కాదన్నారు వీహెచ్. ఇవాళ కాంగ్రెస్ నేత వి. హనుమంతరావుతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరా గాంధీ చేయని ధైర్యం సోనియా గాంధీ చేశారని..తానేమీ పెద్ద నాయకుడిని కాదన్నారు.
గత ఎన్నికల్లో ఈటల రాజేందర్‌కు గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు పాడి కౌశిక్ రెడ్డి. ఆయన టీఆర్‌ఎస్‌లో చేరడంతో అక్కడ గులాబీ జెండా ఎగరడం ఖాయం అనుకున్నారు కేసీఆర్. కానీ టీఆర్ఎస్ అంచనాలన్నీ తారుమారయ్యాయి. కేసీఆర్ వ్యతిరేక ఓటు బ్యాంకు అంతా ఈటలకు పడింది. కౌశిక్‌రెడ్డి తోనే కేసీఆర్ ఓడిపోయారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.
కాంగ్రెస్ నుంచి కౌశిక్ రెడ్డి పోటీ చేస్తే 30,40 వేల ఓట్లు వచ్చేవంటున్నారు. కౌశిక్ రెడ్డితో ఈటెలకు ఓట్లు తగ్గి కేసీఆర్ గెలిచేవారని వ్యాఖ్యానించారు. కౌశిక్‌రెడ్డి చేరితే.. 60 వేల ఓట్లు టీఆరెస్‌కు వస్తాయని కేసీఆర్ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోలైన 2,05,236 ఓట్లలో 34,206 ఓట్లు వస్తే బల్మూరికి డిపాజిట్ దక్కేది. కానీ ఎవరూ ఊహించని విధంగా బల్మూరికి 3014 ఓట్లు మాత్రమే వచ్చాయి.హుజురాబాద్ ఉపఎన్నికలో ప్రత్యర్థి పార్టీలకు కాంగ్రెస్ పోటినివ్వకపోగా.. ఘోరంగా డిపాజిట్ కోల్పోవడంతో ఏంచేయాలో తోచడం లేదు ఆ పార్టీ నేతలకు.