ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు జరిగి దాదాపు నెల రోజులు కావొస్తున్నది. ఇప్పటి వరకు ఆ దేశంలో ఏర్పాటు చేసిన తాలిబన్ల ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు గుర్తించడంలేదు. దీంతో తాలిబన్ ప్రభుత్వంలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అందరికీ సమానమైన హక్కులు కల్పిస్తామని, మహిళల హక్కులను కాపాడతామని, సమీకృత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన తాలిబన్లు ఇచ్చిన హామీలకు విరుద్ధంగా పాలన సాగిస్తున్నారు. ఇస్లామిక్ చట్టాల ప్రకారమే ప్రభుత్వం నడుస్తుందని, చట్టాలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారికి శిక్షలు తప్పవని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆ దేశంతో సంబంధాలు పెట్టుకోవడానికి ప్రపంచదేశాలు ఆలోచిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ కాకుండా ఇతర ప్రత్యామ్నాయాలను చూసుకుంటున్నారు. అయితే, ఇప్పుడు మరో హామీతో తాలిబన్లు ముందుకు వచ్చారు. కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేవని, అన్నిరకాల సౌకర్యాలను ఏర్పాటు చేశామని, అంతర్జాతీయ సర్వీసులకు అనుగుణంగా ఎయిర్‌పోర్ట్ రెడీగా ఉందని, ప్రపంచదేశాలు అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు అనుమతులు ఇవ్వాలని, చదువుల కోసం, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే ఆఫ్ఘన్ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. వెంటనే సర్వీసులు ప్రారంభించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం పాకిస్తాన్ కొన్ని సర్వీసులను మాత్రమే నడుపుతున్నది. మిగతా దేశాలు సర్వీసులు నడిపేందుకు ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాలిబన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న చైనా, రష్యాలు కూడా ఎలాంటి సర్వీసులను నడపడం లేదు.