భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వరంగల్ జిల్లాలో రెండు రోజులు పర్యటించారు. మొదటి రోజు రామప్ప ఆలయాన్ని దర్శించుకున్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, రెండవ రోజు వరంగల్ నగరంలో చరిత్రాత్మక వెయ్యి స్తంభాల గుడిని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని కొత్తగా నిర్మించిన 10 కోర్టుల భావన సముదాయాన్ని ప్రారభించారు. శిథిలావస్థలో ఉన్న కోర్టులను పునరుద్దరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టుగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప గుడి శిల్ప సౌందర్యాన్ని సతీసమేతంగా తెలుసుకుని అబ్బురపడ్డారు.

భద్రకాళీ ఆలయం వద్దకు చేరుకున్న జస్టిస్ ఎన్వీరమణ దంపతులకు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆధునిక సదుపాయాలతో నిర్మించిన పది కోర్టుల సముదాయాన్ని, పోక్సో కోర్టు, ఫ్యామిలీ కోర్టును సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. కోర్టు ప్రాంగణంలో శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మతో కలిసి సీజేఐ కోర్టు ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం ఏర్పటు చేసిన సమావేశం లో ఆయన మాట్లాడారు.
వరంగల్ నగరంలో తనకు అవినాభావ సంబంధం ఉందన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. వరంగల్ కి మూడుసార్లు వచ్చినట్లు గుర్తు చేశారు. వరంగల్ లో తనకు బంధువులు, మిత్రులు ఉన్నారన్నారు. వరంగల్ కోర్టు బిల్డింగ్ ప్రారంభోత్సవం కోసం వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ. వరంగల్ పోరాట గడ్డ. విప్లవకారులు తిరిగిన నేల. దేశానికి ప్రధాన మంత్రిని అందించిన ప్రాంతం వరంగల్ అని తెలిపారు. పోరుగల్లుకు వందనం, ఓరుగల్లుకు వందనం, వరంగల్ కు వందనం అన్నారు జస్టిస్ ఎన్వీ రమణ,
చారిత్రాత్మక సంపదకు వరంగల్ నిలయం. అద్భుతమైన ఆనవాళ్లకు వరంగల్ కేంద్రం. ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు, పోరాటయోధులు ఇక్కడ నుంచి వచ్చారు. శిథిలావస్థలో ఉన్న కోర్టుల సముదాయాలను తీసివేసి అధునాతన సౌకర్యాలతో కోర్టులను నిర్మించాలని నేను సంకల్పించాను. నా ఆలోచనలు, భావాలకు అనుగుణంగా వరంగల్ కోర్టును నిర్మించారు. వరంగల్ కోర్టు భవనాన్ని మోడల్ కోర్టు భవనంగా చేసి భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు పంపిస్తాను అని చెప్పారు. అలాగే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కోర్టు భవనాలు నిర్మించాలి అని చెప్పిన ఆయన. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకున్న తెలంగాణ ప్రభుత్వం నిధులు ఇచ్చి కోర్టు భవనాన్ని నిర్మించడం అభినందనీయం అన్నారు.
న్యాయ వ్యవస్థ పైన కోవిడ్ తీవ్ర ప్రభావం చూపింది అని చెప్పారు. ఇక గ్రామీణ ప్రాంత కోర్టులో న్యాయవాదులు ఇబ్బందులు పడుతున్న తీరు తన దృష్టికి రావడంతో మొబైల్ న్యాయ స్థానాలు ఏర్పాటు చేయాలని సూచించాను. కోవిడ్ వలన ఉపాధి కోల్పోయిన న్యాయవాదులకు ఆర్థిక సహాయం అందించాలని కేంద్రాన్ని సూచించా. కానీ భారత ప్రభుత్వం నుండి ఇప్పటికీ స్పందన రాలేదన్నారు. వరంగల్ జిల్లాలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణకు అభినందనలు వెల్లివిరిశాయి. న్యాయ మూర్తులు, న్యాయవాదులు ఆయనకు సన్మానం చేసేందుకు పోటీపడ్డారు.