ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ.. ఈ సారి నెల్లూరు జిల్లాలో తుఫాన్ తీరాన్ని దాటుతుందని అంచనా వేసింది… ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 430 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం… ఇవాళ మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని.. ఆ తర్వాత పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఇవాళ సాయంత్రం తమిళనాడులోని కారైకల్, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట మధ్య కడలూరు సమీపంలో తుఫాన్‌గా మారి తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది.. ఇక, శుక్రవారం నాటికి ఇది బలహీనపడి వాయుగుండంగా మారుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు.
Read Also: నవంబర్ 11, గురువారం దినఫలాలు
అయితే, నెల్లూరు జిల్లాలో తుఫాన్ తీరం దాటడం చాలా సంవత్సరాల తర్వాత అనే చెప్పాలి.. 2008 నవంబర్ 13న నెల్లూరు వద్ద తుఫాన్ తీరాన్ని దాటింది. మళ్లీ ఇప్పుడు ఆ జిల్లాలో తుఫాన్ తీరం దాటే అవకాం ఉంది. దీని ప్రభావంతో.. ఇవాళ, రేపు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు, ఒకటిరెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశాలు ఉండగా.. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అతిభారీ వర్షాలు, కడప, చిత్తూరు, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ఒకటిరెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని… రేపు నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో ఒకటిరెండు చోట్ల భారీవర్షాలు, గుంటూరు, అనంతపురం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ చెబతోంది.. ఇక, ఈ సమయంలో విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయగా.. కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవుల్లో అప్రమత్తత హెచ్చరికలు జారీచేశారు. రెండురోజులు తీరం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు అధికారులు.