ఆ ఇద్దరి మీదా విచారణ ఉంటుందని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ చేసిన వ్యాఖ్యలు చాలా దుమారం రేపాయి. ఇది ప్రభుత్వం అధికారిక వైఖరా? లేదా వాసిరెడ్డి పద్మ వ్యక్తిగత అభిప్రాయమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ అధికార వైఖరి అయితే ఈ సమస్యను ప్రభుత్వం సీరియస్‌గానే పట్టించుకుంటోందని అనుకోవాలి.
ఇద్దరు ముఖ్యల మీద ఆడియో టేపులు బయటపడటం సంచలనం!
ఏపీలో ఇద్దరు అధికార ప్రజాప్రతినిధుల ఆడియో టేప్‌లు కలకలం సృష్టిస్తున్నాయి. ఇద్దరూ ప్రముఖులు కావడం.. ఒకటైతే.. ఆ టేపుల్లో అవతలివైపు ఉంది మహిళలు కావడంతో ఆ రెండూ చర్చనీయాంశం అయ్యాయి. పది రోజుల వ్యవధిలోనే ఇద్దరు ముఖ్యుల మీద ఇలా ఆడియో టేపులు బయటపడటం సంచలనం అయ్యాయి. ఇక సోషల్ మీడియా అయితే ఎవరికి ఏ యాంగిల్లో కావాలో ఆ యాంగిల్లో వాటిని చిలువలుపలువలుగా పోస్ట్ చేస్తూనే ఉన్నాయి.
హైకమాండ్ వారి వాదనను నమ్మడం లేదా?
ఆడియో టేపులపై స్పందించిన మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్!
ఎప్పుడైతే సోషల్ మీడియాలో ఇవి ప్రత్యక్షం అయ్యాయో.. వెంటనే ఆ ఇద్దరూ రంగంలోకి దిగారు. తమ మీద కుట్ర జరిగిందని, అది తమ గొంతు కాదని.. శత్రువుల కుట్ర అని.. వీటి మీది విచారణ జరిపించాలని పోలీస్ కేసులు పెట్టారు కూడా. సహజంగానే వాళ్ల మీద వచ్చిన ఆరోపణలను వాళ్లే కడిగేసుకునే ప్రయత్నం చేశారు. అయితే వీరి వాదనను హైకమాండ్ నమ్మడం లేదా? లేక వారికి సంబంధంలేదని గట్టిగా చెప్పేందుకు ఇంకో అడుగు ముందుకు వేస్తోందా? అనిపిస్తోంది. ఎందుకంటే… ఆ ఇద్దరు తప్ప ఈ ఆడియో టేపుల వ్యవహారం మీద వేరే ఎవరూ స్పందించలేదు… సమర్థించలేదు. ఖండించలేదు. అలా స్పందించడం కూడా గతంలో ఇలాంటి ఆడియో టేపులు బయటపడ్డప్పుడు ఎప్పుడూ కూడా జరగలేదు. వాళ్లూ వాళ్లూ అంతర్గతంగా ఏదో ఒక వివరణ ఇచ్చుకుని మమా అనిపించుకున్నవే ఎక్కువ ఉన్నాయి. కానీ ఈసారి సీన్ మారింది. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆడియో టేపులపై స్పందించారు. తామూ సమాచారం తెప్పించుకుంటున్నామని చెప్పారు. అంతేనా… ఆ ఘటనలపై విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని గట్టిగా నొక్కి చెప్పారు కూడా. మహిళలను ఇబ్బందిపెట్టేవాళ్లు ఎవరైనా సరే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు వాసిరెడ్డి పద్మ.
తనంతట తానే మాట్లాడారా? ఎవరైనా మాట్లాడించారా?
అయితే వాసిరెడ్డి పద్మ తనంతట తానుగా ఈ వ్యాఖ్యలు చేయలేదు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె ఇలా మాట్లాడారు. అయినా… సరే ఎక్కడో అనుమానం. సొంత పార్టీ విషయం. అందులోనూ ఆ టేపుల్లో మాట్లాడారని చెబుతున్న ఇద్దరూ సీనియర్లు. అలాంటి వారి గురించి సీనియర్ అయిన వాసిరెడ్డి పద్మ తనంతట తానే అంత గట్టిగా మాట్లాడారా? లేక ఎవరైనా మాట్లాడించారా? అనే అనుమానాలు మొదలయ్యాయి. ఖచ్చితంగా హైకమాండ్ పెద్దల డైరెక్షన్ లోనే పద్మ అలా రియాక్ట్ అయి ఉంటారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. సొంత పార్టీ నేతలపై ఇలాంటి వచ్చినప్పుడు దాట వేయడమో… లేక వాళ్లు కేసులు పెట్టారు కదా… విచారణలో ఏం తేలుతుందో చూద్దాం… అని తప్పుకుంటారు. కానీ వాసిరెడ్డి పద్మ ఇలాంటివి బయట వ్యక్తులు చేస్తే ఎలా తీసుకుంటారో… దీన్నీ అలాగే సీరియస్‌గా తీసుకున్నారు. అయితే హైకమాండ్ దీన్ని పార్టీ పరువు సమస్యగా చూస్తోందా? అందుకే మహిళా కమిషన్ తో విచారణ జరిపించాలని అనుకుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.