రాజకీయాల్లో ఒకప్పుడు ఆయన చక్రం తిప్పారు. మధ్యలో చర్చల్లో లేకుండా పోయారు. ఇప్పుడు అధినేత ఫ్రేమ్‌లో ఉన్నారో లేరో కూడా తెలియదు. అప్పుడెప్పుడో బాస్ ఇచ్చిన మాట మేరకు.. పిలుపు రాకపోతుందా అని ప్రగతిభవన్ వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. మళ్లీ లైమ్‌లైట్‌లోకి వస్తారా? ఈ దఫా పదవి రాకపోతే.. రాజకీయ భవిష్యత్ కష్టమేనా? అధికార పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి?
ఎమ్మెల్సీ కావాలని చందర్రావు ఆశ!
వేనేపల్లి చందర్రావు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒకప్పుడు బలమైన నాయకుడు. కోదాడ నుంచి ఆరుసార్లు పోటీ చేసి.. నాలుగుసార్లు ఎమ్మెల్యే అయ్యారు కూడా. 2018 ఎన్నికల్లో మరోసారి అదృష్టం పరీక్షించుకుందామని చూసినా.. సమీకరణాలు కలిసి రాలేదు. ఆ తర్వత పొలిటికల్ తెరపై చందర్రావు పేరు వినిపించింది తక్కువే. దీంతో ఆయనకు రాజకీయ భవిష్యత్ ఉందా? అని పార్టీలో చర్చించుకుంటున్నారట. పార్టీలో ఎమ్మెల్సీ పదవుల పందేరానికి టైమ్ దగ్గరపడటంతో ఆయన పేరు చర్చల్లో నలుగుతోంది. ఈసారి ఆయనకు పదవి దక్కకపోతే పరిస్థితి ఏంటని మరికొందరు ప్రశ్నలు సంధిస్తున్నారు.
2018 టికెట్ వస్తుందని ఆశించినా తప్పని నిరాశ
కోదాడ నుంచి 1985, 1989, 1994 ఎన్నికల్లో వరసగా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నాడు చందర్రావు గుర్తింపు పొందారు. పదేళ్ల గ్యాప్ తర్వాత 2009లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగుపెట్టారు. 2014లో చందర్రావు బలహీనపడ్డారని భావించి బొల్లం మల్లయ్య యాదవ్‌కు టీడీపీ టికెట్ ఇచ్చింది. ఆ సమయంలో కామ్‌గానే ఉన్న చందర్రావు.. 2016లో టీఆర్ఎస్లో చేరిపోయారు. 2018 టీఆర్ఎస్ టికెట్ కోసం తీవ్రంగానే శ్రమించినా ఫలితం దక్కలేదు. సీఎం కేసీఆర్, చందర్రావు ఒకే సామాజికవర్గం కావడంతో ఆయనకే టికెట్ ఇస్తారని అంతా అనుకున్నా… పరిస్థితులు అనుకూలించలేదు. టీఆర్ఎస్కే చెందిన శశిధర్‌రెడ్డి టికెట్ కోసం పోటీపడటంతో.. ఇద్దరి మధ్యా పంచాయితీ ఎలా తేల్చాలా అని తలపట్టుకున్నారు. ఇంతలో బొల్లం మల్లయ్య యాదవ్ టీఆర్ఎస్లో చేరడం.. పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వడం..ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది.
ఎమ్మెల్సీని చేస్తానని అధినేత హామీ ఇచ్చారట!
నాటి ఎన్నికల్లో మల్లయ్య యాదవ్‌ను గెలిపిస్తే .. ఎమ్మెల్సీని చేస్తానని చందర్రావుకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని చెబుతారు. అప్పటి నుంచి ప్రగతిభవన్ నుంచి ఎప్పుడు ఫోన్ వస్తుందా? పదవి ఎప్పుడిస్తారా అని ఆయన ఎదురు చూడటమే సరిపోయింది. ఈ దఫా అయినా ఛాన్స్ ఉంటుందా లేదా అని ఆయన వర్గం చర్చించుకుంటోందట. ఎమ్మెల్సీ కాకపోతే ఇంకేదైనా పదవి ఉంటుందని కూడా అనుకుంటున్నారట. కాకపోతే.. దేనిపైనా క్లారిటీ లేదు.
అధినేత ఫ్రేమ్‌లో చందర్రావు ఉన్నారా?
అప్పట్లో ముఖ్యమంత్రిని సైతం నేరుగా కలిసే స్థాయి ఉన్న చందర్రావు.. నేడు రాజకీయ భవిష్యత్‌తోపాటు ఉనికికోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇంతకీ అధినేత ఫ్రేమ్‌లో చందర్రావు ఉన్నారా లేరా అని మరికొందరు ప్రశ్నించుకుంటున్నారు. రెండు ఎన్నికలకు దూరంగా ఉన్న వ్యక్తికి ఇప్పుడు పదవి రాకపోతే.. పోటీ పెరిగిన రాజకీయాల్లో మనుగడ కష్టమన్నది అధికార పార్టీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. చందర్రావు అదృష్టం ఎలా ఉందో చూడాలి.