రాజకీయాల్లో అధికార, విపక్షాల మధ్య విమర్శలు, ఎత్తుగడలు సహజం. ఎప్పుడు ఏం అంశం కీలకమవుతుందో ఊహించలేం. ఎప్పుడెలా పరిష్కారం లభిస్తుందో చెప్పలేం. ఆ విధంగా చర్చల్లోకి వచ్చిందే తెలంగాణ CMO. ఒక్క దళిత అధికారి కూడా లేరన్న విపక్షాల విమర్శలకు విరుగుడు మంత్రం వేసింది అధికారపక్షం. అదేంటో ఈస్టోరీలో చూద్దాం.
సీఎంవోపై విమర్శలకు ప్రభుత్వం విరుగుడు మంత్రం!
హుజురాబాద్ ఉపఎన్నిక వేళ తెలంగాణ రాజకీయాల్లో అనేక అంశాలు చర్చల్లోకి వస్తున్నాయి. సమయం.. సందర్భాన్ని బట్టి ప్రత్యర్థులను ఇరుకున పెట్టే అంశాలను ప్రస్తావిస్తున్నాయి పార్టీలు. ఈ క్రమంలోనే విపక్షాలు CMOపై గురిపెట్టాయి. సీఎంవోలో ఒక్క దళిత అధికారి కూడా లేరన్నది విపక్షాల మాట. టీఆర్ఎస్‌ను వీడి.. బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ సైతం ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇప్పటికే దళితబంధు పథకం ద్వారా బీజేపీ, కాంగ్రెస్ విమర్శలకు అధికారపక్షం చెక్ పెట్టింది. అదే విధంగా సీఎంవోపై చేస్తున్న విమర్శలకు విరుగుడు మంత్రం వేసింది.
సీఎంవోలో కార్యదర్శిగా రాహుల్ బొజ్జా!
హుజురాబాద్‌లో దళితబంధు పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించిన ప్రభుత్వం.. ఈ స్కీమ్‌ను విజయవంతంగా అమలు చేస్తామని ప్రకటించింది. లబ్ధిదారులకు సీఎం కేసీఆర్ నేరుగా చెక్‌లు అందజేశారు. ఇదే సమయంలో దళితబంధు స్కీమ్ అమలు పర్యవేక్షణకు సీనియర్ IAS రాహుల్ బొజ్జాను నియమిస్తున్నట్టు ప్రకటించారు ముఖ్యమంత్రి. ఆయన సీఎంవోలో కార్యదర్శిగా కొనసాగుతారని సీఎం స్పష్టం చేశారు.
మాజీ ఐఏఎస్ రామయ్య గతంలో ఓఎస్డీగా పనిచేశారు
రాహుల్ బొజ్జా నియామకంతో సీఎంవోపై రాజకీయంగా వస్తున్న విమర్శలకు చెక్ పెట్టినట్టే అన్న చర్చ మొదలైంది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి సీఎంవోలో ఒక్క దళిత అధికారీ లేరన్న విపక్షాల విమర్శలను అధికారపక్షం కొట్టిపారేస్తోంది. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మాజీ ఐఏఎస్ రామయ్య ప్రస్తుతం సీఎంవోలో OSDగా ఉన్నారు. గతంలో ఆయన విజిలెన్స్ కమిషన్‌లో మెంబర్‌గా విధులు నిర్వహించారు కూడా. ఇప్పుడు రాహుల్ బొజ్జాను కార్యదర్శిగా నియమించారు.
రాజకీయ లబ్ధి కోసమే సీఎంవోపై విపక్షాల విమర్శలా?
సడెన్‌గా ఈ లెక్కలు.. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన అధికారుల వివరాలు బయటకు రావడంతో విపక్షాల విమర్శలకు పదును లేదని టీఆర్‌ఎస్ మండిపడుతోంది. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వంపై బురద జల్లు తున్నారన్నది గులాబీ శిబిరం అభ్యంతరం. హుజురాబాద్ ఉపఎన్నిక వేళ రచ్చే అజెండాగా అసత్య ప్రచారం చేస్తున్నారని విపక్షాలపై టీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. కాకపోతే ఇప్పుడు రాహుల్ బొజ్జా నియామకంతో మారు మాట్లాడలేని విధంగా ప్రతిపక్ష పార్టీలకు అధికారపక్షం స్ట్రోక్ ఇచ్చిందట. మరి.. విపక్షాలు ఇప్పుడేమంటాయో చూడలి.