రాకరాక వారికి ఓ అవకాశం వచ్చింది. అక్కడ జగనన్న.. ఇక్కడ దాసన్న అండ ఉందని పదేపదే చెప్పుకొని మురిసిపోయారు. అట్టహాసంగా ప్రమాణ స్వీకారానికి ప్లాన్ చేస్తే.. వేదిక వెలవెల పోయిందట. కట్‌చేస్తే ఇప్పుడు ఆ అంశంపై వైసీపీలో అదేపనిగా చెవులు కొరుక్కుంటున్నారట. వీళ్లు పిలవలేదా లేక.. వాళ్లే రాలేదా అని చర్చించుకుంటున్నారట.
గ్రాండ్‌గా సుడా ఛైర్‌పర్సన్ ప్రమాణ స్వీకారోత్సవం!
శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టడంతో ఇక్కడి వైసీపీ నేతలకు సీఎం జగన్ మనసులో ప్రత్యేక స్థానం దక్కింది. స్పీకర్, డిప్యూటీ సీఎం, మరో మంత్రి పదవి జిల్లాకు దక్కాయి.
ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లోనూ జిల్లాకు పెద్ద పీట వేశారు. ఈ క్రమంలో తొలిసారి ఏర్పాటైనా శ్రీకాకుళం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ-SUDAకి ఛైర్‌పర్సన్‌గా నరసన్నపేట నియోజకవర్గానికి చెందిన కోరాడ ఆశాలత గుప్తాను నియమించారు. ఆమెది కళింగకోమటి సామాజికవర్గం. తమకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞత తెలియజేస్తూ గ్రాండ్‌గా ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించింది ఆ సామాజికవర్గం. ఇప్పుడా ప్రమాణ స్వీకార మహోత్సవంపైనే జిల్లాలో చర్చ జరుగుతోంది.
ప్రమాణ స్వీకారోత్సవ సభ చుట్టూ రాజకీయం!
సుడా పరిధిలో శ్రీకాకుళం జిల్లాలోని 28 మండలాలొస్తాయి. పాతపట్నం, పాలకొండ నియోజకవర్గాలను మినహాయిస్తే మిగిలిన 8 నియోజకవర్గాల్లోని మండలాలు, పలు గ్రామాలు ఈ పరిధిలోనే ఉన్నాయి. అంటే దాదాపు జిల్లా మొత్తానికి ఆమె ఛైర్‌పర్సన్. ఇంతటి కీలకమైన అథారిటీకి తొలి ఛైర్‌పర్సన్ పదవి.. మహిళకు, అదీ తన నియోజకవర్గానికి చెందిన ఆశాలత గుప్తాకు దక్కడం కోసం డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తెరవెనక చక్రం తిప్పారట. ఇంతవరకూ బాగానే ఉన్నా.. అట్టహాసంగా నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమం చుట్టూనే రాజకీయం రాజుకుంటోందట.
8 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రాలేదు
సభ ఆద్యంతం దాసన్న భజనే?
ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కృష్ణదాస్ దంపతులు, ఇతర కార్పొరేషన్ల ఛైర్మన్లు మినహా మిగతావారు ఎవరూ హాజరు కాలేదు. 8 నియోజకవర్గాలు సుడా పరిధిలో ఉన్నా.. అక్కడి ఎమ్మెల్యేలు కనిపించలేదు. సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుతం శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న ధర్మాన ప్రసాదరావు సైతం రాలేదు. ఫ్లెక్సీల దగ్గర నుంచి వేదిక వరకు కృష్ణదాస్ కుటుంబానికే తప్ప మిగిలిన వైసీపీ నేతలకు ప్రాధాన్యం కల్పించకపోవడం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. సుడా ఛైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించినంత మాత్రాన దాసన్నకు భజన చేయడంలో తప్పులేదు కానీ.. ఇంత పెద్ద కార్యక్రమం పెట్టినప్పుడు జిల్లాలో కీలకంగా ఉన్న ధర్మాన ప్రసాదరావు, కిల్లి కృపారాణి, స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి అప్పలరాజుతోపాటు మిగిలివారిని విస్మరించడం ఏంటీ.. అందరినీ పిలవాలి కదా అని గుసగుసలాడుకుంటున్నారట.
దాసన్నను చూసి అంతా వచ్చేస్తారని అనుకున్నారా?
అయితే కొంతమందిని ఆశాలత ఆహ్వానించారని చెబుతున్నారు. ఇంకొంత మందిని పిలవ లేదని అనుకుంటున్నారు. దాసన్నను చూసి అందరూ వచ్చేస్తారు. వేదిక ఎక్కుతారు అని ఛైర్‌పర్సన్ ఆశించారు. అయితే పిలుపుల్లో తేడాతో ఎవరూ ఆ వైపు చూడలేదు. జిల్లా మొత్తం వచ్చి ఆహో ఓహో అంటారు.. అదరగొడతారు అనుకున్నది కాస్తా.. ఉసూరు మనిపించింది. దాసన్న ఒక్కరు చాలు అని ఆమె అనుకుంటే.. మేమెందుకు అని మిగలిన వాళ్లు ముఖం చాటేశారు. ఇక తమ్ముడు ధర్మాన ప్రసాదరావు ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడల్లా వేరే ప్రోగ్రామ్స్ పెట్టుకుని వెళ్లిపోతుండటం విశేషం. అయితే.. వీళ్లందరూ రాలేదంటే.. ఎవరి పనులు వారికుంటాయి కదా అంటూ వైసీపీలో ఓవర్గం సర్దిచెబుతోందట.