ఆ ఎస్పీ కొత్తగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన జిల్లాకు అడుగుపెట్టకముందే, ఆయన పనితీరు తెలిసి తలలు పట్టుకున్నారు. సరిగ్గా నెలకూడా గడవలేదు…ఆయనేంటో అధికారపార్టీ నేతలకు పూర్తిగా అర్థమై పోయింది. ద్వితీయ శ్రేణి నాయకుల సంగతి అటుంచితే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లకే ఆ ఎస్పీ కొరుకుడు పడడం లేదట…ఇంతకీ ఎవరా ఎస్పీ? ఆ జిల్లాలో ఏం జరుగుతోంది?
కర్నూలు జిల్లా పోలీస్ బాస్ గా కర్ణాటక క్యాడర్ అధికారి సుధీర్ కుమార్ రెడ్డి నియమితులయ్యారని తెలియగానే ప్రజాప్రతినిధులు తలలు పట్టుకున్నారట. కర్ణాటకలో ముక్కుసూటిగా వ్యవహరించి నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరించిన సుధీర్ కుమార్ రెడ్డి గురించి మీడియాలో , ప్రత్యేకించి సోషల్ మీడియాలో విస్తృత కథనాలు వచ్చాయి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిజాయితీగా పనిచేసిన అధికారిగా ఆయనకు పేరుంది. ఆయన్ని కర్నూలు జిల్లా ఎస్పీ గా నియమించారని తెలియగానే ….ఎవరు సిఫార్సు చేసారంటూ ఆరా తీసారట. రాజకీయ నాయకుల అనుచరులుగా ఉన్న మట్కా, పేకాట శిబిరాల నిర్వాహకులు, అక్రమ మద్యం వ్యాపారులు ఇదెక్కడి ఖర్మ రా బాబూ అనుకున్నారట.
ఎస్పీ గా సుధీర్ కుమార్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తరువాత ముందుగా నేరస్థుల కంటే వారికి సహకారం అందిస్తున్న పోలీసులు, పోలీస్ అధికారుల్లో మార్పు తేవాలనుకుకున్నారట. ముల్లును ముల్లుతోనే తీయాలనే యాంగిల్లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారట. అవాంఛనీయ, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నవారనికి అండగా ఉన్నవారి జాబితా తయారు చేశారట ఎస్పీ. అలా ఇప్పటి వరకు ముగ్గురు ఎస్ ఐలు, ముగ్గురు ఏ ఎస్ ఐ లు, పలువురు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు. 32 మందిని బదిలీ చేశారు. జిల్లాలో ఆ చివరి నుంచి ఈ చివరకు, ఈ చివరి నుంచి ఆ చివరికి బదిలీ చేశారు. మట్కా, గుట్కా, పేకాట, అక్రమ మద్యం వ్యాపారంతో సంబంధం ఉందని సమాచారం ఉన్న వారిని బదిలీ చేయడం, లేదా సస్పెండ్ చేయడంతో వారిలో భయం నెలకొందట.
నేతల అడుగులకు మడుగులొత్తె పోలీస్ అధికారులు, సిబ్బంది తమ పరిస్థితి ఏమిటని నేతలను ఆశ్రయిస్తున్నారట. ఎస్పీ గురించి తెలిసిర నేతలు ఆయనకు చెప్పే సాహసం చేయలేకపోతున్నారట. ఎస్పీ కి చెప్పినా వినడు, ఇపుడు పరిస్థితి బాగా లేదు, ఏమి చేయలేమని తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారట ప్రజాప్రతినిధులు. నియోజకవర్గ నాయకులు, ద్వితీయశ్రేణి నాయకులు పోలీస్ స్టేషన్లలో తమ మాట వినడం లేదని ప్రజాప్రతినిధుల వద్ద వాపోతున్నారట. తొమ్మిదేళ్లు కష్టపడ్డామని, ఇపుడు ఏదో అధికారం వచ్చిందనుకుంటే ఇదేం పరిస్థితి అని వాపోతున్నారట. అనుచరులకు సమాధానం చెప్పలేక, ఎస్పీ కి చెప్పలేక ప్రజాప్రతినిధులు మాధనపడుతున్నారట. ఆ ఎస్పీ యమా స్ట్రిక్టు…ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. లేనిపోని సమస్యలు తెచ్చుకోకండని అనుచరులకు చెబుతున్నారట. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అయితే ఏకంగా, ప్రెస్ మీట్ పెట్టి మరీ తన అనుచరులకు వార్నింగ్ ఇచ్చారట. మట్కా, గుట్కా, అక్రమ మద్యం, రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడవద్దని కార్యకర్తలను హెచ్చరించారు ఎమ్మెల్యే. ఇలాంటి చర్యలను ఎస్పీ సహించరు. ఆయనకు మనం సహకరించాలని సూచించారు. ఇప్పటికి ఎవరైనా ఇలాంటి అక్రమ వ్యాపారులు చేస్తుంటే మానుకోవాలని, పోలీసులు పట్టుకుంటే మమ్మల్ని ఫోన్ చేసి సతాయించవద్దని హితవు చెప్పారు.
ఎస్పీ ఇంత కఠినంగా వ్యవహరించినా అక్రమ మద్యం, మట్కా, గుట్కా, పేకాట పూర్తిగా కనుమరుగయ్యాయా అంటే లేదనే సమాధానం వస్తుంది. అయితే చాలా వరకు తగ్గిందట. అక్రమార్కులకు సహకరిస్తున్న పోలీస్ అధికారుల్లో భయం ఉందట. అయితే కొందరు మాత్రం ఇంకా అక్రమ మద్యం, మట్కా, గుట్కా వ్యాపారులకు పోలీస్ కదలికలపై ముందుగానే సమాచారం ఇస్తున్నారట. మొత్తమ్మీద ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ప్రజాప్రతినిధులకు కొరకరాని కొయ్యగా మారి తమకు అనుకూలంగా ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందికి నిద్రలేకుండా చేస్తున్నారట. అక్రమ మద్యం, పేకాట,మట్కా, గుట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలు అరికట్టేందుకు సీఎం జగన్ నుంచి పూర్తి సహకారం ఎస్పీ కి ఉందనే చర్చ జరుగుతోందట. దీంతో ఆయన్ని ఏం అనలేక, మార్చేయమని చెప్పలేక, కుక్కిన పేనులా మారిపోయారు కర్నూలు అధికార పార్టీ నేతలు.