మంత్రాలకు చింతకాయలు రాలతాయా? ఈ మాటేమోకానీ అక్కడ మాత్రం పిడికెడు ఇసుక.. బారెడు చర్చకు దారితీస్తోంది. ఇద్దరు అధికారుల మధ్య పంచాయితీని పతాకస్థాయికి తీసుకెళ్లిన ఆ ఇసుక చుట్టూనే అనేక కథలు పుట్టుకొస్తున్నాయి. ఉన్న రాజకీయాలతో ఉద్యోగులు నలిగిపోతున్న సమయంలో.. రామాయణంలో పిడకల వేటలా జరుగుతోన్న ఆ చర్చేంటో ఈస్టోరీలో చూద్దాం.
ఉన్నతాధికారుల దగ్గర వాదన వినిపించేందుకు డీసీ, ఏసీ సిద్ధం!
విశాఖ జిల్లా దేవాదాయశాఖ అధికారుల మధ్య పంచాయితీ అమరావతికి చేరింది. అంతర్గత విభేదాల కారణంగా కుమ్ములాడుకున్న డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్, అసిస్టెంట్ కమిషనర్ శాంతిలను విచారణకు హాజరుకావాలని కమిషనర్ నుంచి ఆదేశాలు వచ్చాయి. రచ్చకెక్కిన ఈ అధికారుల వ్యవహారాన్ని ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే ఆర్జేసి సురేష్‌బాబు శాఖాపరమైన విచారణ నిర్వహించారు. పుష్పవర్ధన్‌పై ఇసుక చల్లడానికి వేధింపులే కారణమని ఏసీ శాంతి చెప్పడంతో అసలు ట్విస్ట్ మొదలైంది. ఈ వ్యవహారంపై మహిళ కమిషన్ నివేదిక కోరడంతో ఇంకా ప్రాధాన్యం పెరిగింది. ఉన్నతాధికారుల ఎదుట తమ వాదనలను వినిపించేందుకు ఆధారాలతో సహా ఏసీ..డీసీలు సమాయత్తం అవుతున్నట్టు సమాచారం. అమరావతిలో జరిగే ఎంక్వైరీ తర్వాత ఎటువంటి నిర్ణయం వెలువడుతుందోననే ఉత్కంఠ దేవాదాయశాఖ వర్గాల్లో ఉంది.
శాంతి ఇసుకను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు?
శాంతి తెచ్చిన ఇసుకకు మహిమలు ఉన్నాయా?
సీనియర్ అధికారైన పుష్పవర్ధన్ పై ఏసీ శాంతి దుమ్మెత్తి పోయడం మీడియాలో ప్రముఖంగా వచ్చింది. సోషల్ మీడియాలో విస్త్రతంగా చక్కర్లు కొట్టింది. అసలే పూజలు, నెగెటివ్ వైబ్రేషన్స్ మీద ఎక్కువ ఆసక్తిని చూపించే దేవాదాయశాఖలో ఇప్పుడు ఈ వ్యవహారం చుట్టు కొత్త కథలు అల్లుకున్నాయి. అసిస్టెంట్ కమిషనర్ శాంతి దుమ్మెత్తి పోసిన ఇసుక ఎక్కడ నుంచి తెచ్చారు. గొడవ జరిగిన సమయంలో శాంతి చాలా దూకుడుగా డీసీ చాంబర్లోకి ప్రవేశించారు. ఒక చేతిలో సెల్ ఫోన్లు.. మరో చేతితో పిడికెడు ఇసుక తీసుకొచ్చారు. రావడం రావడమే చేతిలో ఉన్న ఇసుకను డీసీ మీద చల్లారు. ఆడపిల్ల ఉసురు పోసుకుంటున్నావ్.. నాశనమైపోతావ్ అంటూ శాపనార్ధాలు పెట్టారు. గతంలో ఎన్నడూ దేవాదాయశాఖలో ఇటువంటి ఘటనలు జరగలేదు. దీంతో శాంతి తీసుకొచ్చిన ఇసుకకు మహిమలు ఉన్నాయేమోననే పుకార్లు కిందిస్థాయి వరకు చేరిపోయాయి.
మంత్రించిన ఇసుకపై దేవాదాయ వర్గాల్లో చర్చ!
ఇసుకకు మహిమలు ఉన్నాయనే అంశం ఆసక్తి రేపుతున్నా.. అసలు విషయం వేరే ఉందట. ఉక్రోషంతో డీసీ ఛాంబర్ వైపు వెళ్లిన ఆమె ఆరుబయట ఉన్న ఇసుకనే తీసుకెళ్లారట. తన ఆవేదనను బయటపెట్టడానికే ఇసుక వేశానని సన్నిహితుల దగ్గర చెబుతున్నారట ఏసీ. డిపార్ట్‌మెంట్ పరువును గంగలో కలిపేశారనే అభిప్రాయం ఉండగా.. ఇప్పుడీ మంత్రించిన ఇసుకపై జరుగుతున్న చర్చ ఉన్నతాధికారులకు చికాకు పుట్టిస్తోందట. అసలే దేవాదాయశాఖ.. పూజలు… పునస్కారాలు.. నమ్మకాలు ఉద్యోగులు.. అధికారుల్లో బలంగానే ఉంటాయి. ఆ నమ్మకాలను ఈ దిశగా మల్లించడమే ట్విస్ట్.
అధికారపార్టీకి చెందిన కీలక నేత ఆశీర్వాదం ఏసీకి ఉందా?
మాన్సాస్ గొడవలో అధికారపార్టీ పెద్దలకు దగ్గరైన డీసీ!
గీతదాటిన అధికారులను ఉపేక్షించకూడదని ప్రభుత్వం భావిస్తే.. ఏసీ, డీసీలపైన చర్యలు కఠినంగా ఉంటాయి. అయితే రెండు రోజుల క్రితం దేవాదాయశాఖ మంత్రిని కలిసిన కొందరు ఈవోలు జిల్లాలో జరుగుతున్న పరిణామాలను ఏకరువు పెట్టారట. అలాగే శాంతి, పుష్పవర్ధన్‌లకు ఉన్న పలుకుబడి, ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ల బలబలపైనా చర్చ మొదలైంది. ఏసీగా గత ఏడాది మే నుంచి విశాఖ జిల్లాలో శాంతి పని చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కీలకనేత ఆశీర్వాదం ఆమెకు ఉందట. ఆ అండతోనే అన్యాక్రాంతమైన దేవాదాయ భూముల స్వాధీనంలో ఎవరినీ లెక్క చేయడం లేదని టాక్. విశాఖ ప్రాంతీయ ఉప కమిషనర్‌గా పుష్పవర్ధన్ 40రోజుల క్రితం బాధ్యతలు చేపట్టారు. ఎక్కువ సమయం సింహాచలం, మాన్సాస్ భూములకు సంబంధించిన విచారణపై దృష్టి పెట్టారు. ఆ క్రమంలోనే ప్రభుత్వ, పార్టీ పెద్దలకు ఆయన బాగా దగ్గరయ్యారనే అభిప్రాయం ఉంది. తాజా వివాదంలో ఇద్దరు అధికారులు ఇప్పటికే తమకు అండగా ఉన్న రాజకీయ పెద్దలను ఆశ్రయించినట్టు తెలుస్తోంది.
ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరాజును సస్పెండ్ చేయడమే గొడవకు కారణమా?
ఏసీ వర్సెస్ డీసీల మధ్య వివాదం ఈ స్థాయిలో రాజుకోవడానికి అనకాపల్లి దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్ వి.శ్రీనివాసరాజును వివిధ ఆరోపణలపై సస్పెండ్ చేయడమేనట. తన వద్ద పనిచేసే అధికారిపై చర్యలు తీసుకోవడాన్ని ఏసీ తీవ్రంగా పరిగణించడంతో వివాదం ముదిరిందనేది ఒక వాదన. అందుకే రాజకీయ జోక్యంతో ఇద్దరు అధికారులకు సర్దిచెబుతారో లేక తనమన అనే భేదం లేకుండా చర్యలు తీసుకుంటారో చూడాలి.