రోదసి యాత్రలో మరో సువర్ణాద్యాయం మొదలైంది. ఇటీవలై ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా నలుగురు సామాన్య టూరిస్టులను స్పేస్ ఎక్స్ సంస్థ రోదసిలోకి పంపింది. భూకక్ష్యలో ఈ క్యాప్సుల్ మూడు రోజుల పాటు భూమిచుట్టూ పరిభ్రమించి ఈరోజు సురక్షితంగా భూమిమీదకు చేరింది. ఇందులో ప్రయాణం చేసిన నలుగురు వ్యక్తులు సురక్షితంగా ఉన్నారని స్పేస్ ఎక్స్ పేర్కొన్నది. ఈ క్యాప్యూల్ అట్లాంటిక్ మహాసముద్రంలో పారాచూట్ సహాయంతో ల్యాండ్ అయింది. నిపుణులైన వ్యోమగాములు లేకుండా సాధారణ ప్రయాణికులతో ఈ యాత్రను చేపట్టడం విశేషం. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో రోదసిలోకి మరికొంత మంది టూరిస్టులను పంపేందుకు స్పేస్ ఎక్స్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇన్పిరేషన్ 4 పేరుతో ఆ యాత్రను చేపట్టింది స్పేస్ ఎక్స్. భూమి నుంచి 575 కిలోమీటర్ల ఎత్తులో ఈ క్యాప్యూల్ పరిభ్రమణం చేసింది. 27,360 కిమీ వేగంతో భూమిని ప్రతి 90 నిమిషాలకు ఒకసారి చుట్టేసింది. ఇది ధ్వనివేగం కంటే 22 రెట్లు అధికం. హబుల్ టెలిస్కోప్ ఉన్న ప్రాంతాన్ని సైతం దాటుకొని యాత్ర సాగింది. ఈ నౌకమొత్తం కంట్రోల్ భూమిమీదనే ఉన్నది. మూడు రోజులపాటు అంతరికక్షంలో అధ్బుతమైన దృశ్యాలను చూశామని టూరిస్టులు చెబుతున్నారు.