ఒకానొక సమయంలో తెలుగు చిత్రసీమలో బాలల చిత్రాలు జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. ఎంత పేరు మోసిన తారలు నటించినా, ‘చైల్డ్ సెంటిమెంట్’ అంటూ ఉంటే, కథ రక్తి కట్టిస్తుందని సినిమాజనం నమ్మకం. అదే తీరున కొందరు టాప్ స్టార్స్ చిత్రాల్లోనూ చైల్డ్ సెంటిమెంట్ బాగా పండి, ఘనవిజయాలు లభించాయి. కొన్ని సార్లు అలాంటి సినిమాలతోనే కొందరికి మరింత పేరు వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. 1970ల ఆరంభంలో రూపొందిన ‘సిసింద్రీ చిట్టిబాబు’ ఆ కోవకు చెందినదే. శోభన్ బాబు స్టార్ డమ్ అందుకోవడానికి దాదాపు పుష్కరకాలం పట్టింది. ఆ సమయంలో శోభన్ బాబు, శారద జంటగా, మాస్టర్ ప్రభాకర్ ప్రధాన పాత్రలో ‘సిసింద్రీ చిట్టిబాబు’ తెరకెక్కింది. 1971 జూన్ 18న విడుదలైన ఈ చిత్రం మంచి ఆదరణ చూరగొంది. ఈ చిత్రాన్ని రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై తమ్మారెడ్డి కృష్ణమూర్తి, ఎ.సంజీవి దర్శకత్వంలో నిర్మించారు.
చిట్టిబాబు మరోజన్మ…
ఈ చిత్రంలో చిట్టిబాబు చేసే పనులు భలే సరదాగా ఉంటాయి. తనను ప్రాణంగా ప్రేమించే అన్నయ్య అంటే చిట్టిబాబుకు ప్రాణం. తన అన్న ప్రేమించిన అమ్మాయితో పెళ్ళయ్యేలా చూస్తాడు చిట్టిబాబు. అలాగే తమ ఊరి మాస్టార్ కోరుకున్న పిల్లతోనే పెళ్ళి జరిపిస్తాడు. పిల్లాడు ఇంతున్నా, చేసేవి పెద్దపనులు. అందువల్ల ఊళ్ళో కొందరికి చిట్టిబాబు అంటే ఎంతో ఇష్టం. మరికొందరికి అతనంటే ద్వేషం. అలా చిట్టిబాబు అంటే నచ్చని స్కూలు కరస్పాండెంట్ అతణ్ణి ఫెయిల్ చేయిస్తాడు. ఎప్పుడూ తన అన్న కొడుకుతో ఆడుకుంటూ ఉండే చిట్టిబాబు, ఆ కారణంగానే చదువులో ఫెయిల్ అయ్యాడని అన్న భావిస్తాడు. బాగా చదువుకుంటేనే బాబుతో ఆడుకోనిస్తానని అన్న అంటాడు. దాంతో చిట్టిబాబు, బాబును తీసుకొని పారిపోతాడు. బాబును పెంచడానికి పలు పాట్లు పడతాడు. చివరకు చిట్టిబాబు అన్న రాము వచ్చి పిలచినా, బాబును తీసుకొని గుడిగోపురం ఎక్కుతాడు. నిన్ను ఏమీ అననని చెబుతాడు రాము. చిట్టిబాబు దిగబోయి కాలుజారి కిందపడి మరణిస్తాడు. తరువాత ఓ పెద్ద కోటీశ్వరుని ఇంట్లో పుట్టిన చిట్టిబాబు స్కూల్ పిల్లలతో విహారయాత్రకు వెళ్ళినప్పుడు ఆ గోపురం చూసి గత జన్మ గుర్తుకు వస్తుంది. అన్న, వదినల దగ్గరకు వచ్చిన చిట్టిబాబు వారిని వీడి వెళ్ళనంటాడు. చివరకు ఆ ధనవంతుడు, తనకు కొడుకు తప్ప ఎవరూ లేరని చెబుతాడు. అందువల్ల చిట్టిబాబు అన్నావదినెలను, పిల్లాడిని, వారి బామ్మను కూడా తమతో పాటే రమ్మని చెబుతాడు కోటీశ్వరుడు. అలా కథ సుఖాంతమవుతుంది.
బంధాలు… అనుబంధాలు…
ఈ చిత్రంలో చిట్టిబాబుగా మాస్టర్ ప్రభాకర్ నటించగా, అతని అన్నావదినెలుగా శోభన్ బాబు, శారద అభినయించారు. ఈ సినిమాకు ముందు శోభన్ బాబు, శారద నటించిన ‘మనుషులు మారాలి’ చిత్రం ఘనవిజయం సాధించింది. ఇందులోనూ వారిద్దరూ జంటగా నటించడం, ఈ సినిమా కూడా మంచి ఆదరణ పొందడంతో వారిద్దరూ హిట్ పెయిర్ గా నిలిచారు. ఆ తరువాత అనేక చిత్రాలలో శోభన్, శారద జోడీ ప్రేక్షకులకు కనువిందు చేసింది.
గుమ్మడి, అల్లు రామలింగయ్య, రాజబాబు, సూర్యకాంతం, రాధాకుమారి, గోకినరామారావు, మాడా, ఓ స్పెషల్ సాంగ్ లో నగేశ్, జ్యోతిలక్ష్మి కనిపించారు. ఈ చిత్రానికి టి.చలపతిరావు సంగీతం సమకూర్చగా, డాక్టర్ సి.నారాయణ రెడ్డి, కొసరాజు పాటలు రాశారు. ఈ చిత్ర నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి సినిమా అనుకరణ రూపొందించారు. ఈ చిత్రానికి తమ్మారెడ్డి కృష్ణమూర్తి పెద్ద కొడుకు లెనిన్ బాబు సహ నిర్మాతగా వ్యవహరించారు. తరువాతి రోజుల్లో “దత్తపుత్రుడు, డాక్టర్ బాబు” వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు లెనిన్ బాబు. ఇక ఈ చిత్రానికి కథ సమకూర్చిన పినిశెట్టి, ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తండ్రి. అలాగే ఈ చిత్ర దర్శకుడు ఏ.సంజీవి, నేటి ప్రముఖ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ కు నాన్న.
పాటల సందడి…
ఈ చిత్రంలో మొత్తం ఎనిమిది పాటలున్నాయి. వాటిలో “వస్తా వెళ్ళొస్తా… రేపు సందేళ కొస్తా…”, “ముళ్ళు గుచ్చుకుంది బావా…”, “చిట్టిబాబు…చిన్నారి బాబూ…”, “బొమ్మలోయ్ బొమ్మలు…”, “ఓహో ఓహో…జాంబియా…” పాటలు ఆదరణ పొందాయి. నగేశ్, జ్యోతిలక్ష్మిపై చిత్రీకరించిన ‘ఓహో ఓహో జాంబియా…’ పాటను కలర్ లో చిత్రీకరించారు. ఇప్పుడు ఆ పాట బ్లాక్ అండ్ వైట్ లోనే కనిపిస్తోంది.