వినయం, విధేయత, స్వామిభక్తి.. ఇవన్నీ వుంటే ఏదైనా సాధించవచ్చు. వడ్డించేవాడు మనవాడైతే ఫంక్తిలో ఎక్కడ కూర్చున్నా మన విస్తరిలోకి అన్నిరకాల రుచులు వచ్చిపడతాయని మరోసారి నిరూపణ అయింది. పెద్దల సభ అంటే కొందరికి మక్కువ. రాజకీయాల్లో జనంలో తిరగకుండా.. దండాలు పెట్టకుండా హాయిగా అయినవారి ఆశీస్సులు వుంటే హాయిగా పెద్దల సభలో దర్జాగా కాలు పెట్టేయవచ్చు.
తెలంగాణ రాజకీయాల్లో సిద్దిపేట కలెక్టర్‌గా పనిచేసి రాజీనామా చేసిన పారుపాటి వెంకట్రామిరెడ్డి గురించి హాట్ టాపిక్ అవుతోంది. ఆయన పదవికి ఇలా రాజీనామా చేయడం, అలా ఎమ్మెల్సీ పదవి ఆయన్ని వరించడం క్షణాల్లో జరిగిపోయింది. కానీ ఆయనకు ఈ పదవి రావడం వెనుక ఆయన గాడ్ ఫాదర్ కేసీఆర్ ప్లానింగ్ అమోఘం. కలెక్టర్ హోదాలో ఉండి తెలంగాణ సీఎం కేసీఆర్ పాద సేవ చేసుకున్నారు వెంకట్రామ్ రెడ్డి, అంతేకాదు వరి వేయవద్దన్న తన స్వామి వాక్కులను తూ.చ తప్పకుండా పాటించారు. ఇటీవల సిద్దిపేట కలెక్టర్ హోదాలో వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
రైతులు వరి విత్తనాలు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో దుమారాన్ని రేపాయి. కోర్టుల నుంచి అక్షింతలు, అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. రైతులను హెచ్చరించడం విమర్శలకు దారితీసినప్పటి నుంచి ఆయన సెలవులో ఉన్నారు. వరి విత్తనాలమ్మితే డీలర్లపై కేసులు పెడతానని, ఉద్యోగులను సస్పెండ్ చేస్తానని హెచ్చరించడమే గాక హైకోర్టు ఆదేశాలను, ఎంపీలు, ఎమ్మెల్యేల ఫోన్లనూ పట్టించుకోనని కామెంట్లు చేశారు. సెలవులో వుండగానే ఆయన పదవికి రాజీనామా చేశారు.
READ ALSO :ఒక్కసారి కాదు వందసార్లు కేసీఆర్‌కు పాదాభివందనం చేస్తా : ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి
పాలనా ఎన్ని వివాదాలు రేగితే.. రాజకీయాల్లోకి వస్తే అంత ఫ్యామస్ అవుతామని ఆయనకు బాగా తెలుసు. అందుకే వాటిని ఆయన లైట్ తీసుకున్నారు. యథా రాజా తథా ప్రజాలాగా యథా సీఎం.. తథా ఐఎఎస్.. అన్నట్టుగా కేసీఆర్ స్వంత జిల్లాలో ఆయన తనదైన దూకుడుతో వ్యవహరించారు. వెంకట్రామిరెడ్డి పదవిలో వుండగానే ఆయన పొలిటికల్ ఎంట్రీపై కొన్నేళ్లుగా జోరుగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే.
ఆయన్ను ఎమ్మెల్సీ చేయడంతో పాటు కేబినెట్‌లోకి తీసుకొని రెవెన్యూ శాఖ అప్పగిస్తానని కేసీఆర్ గతంలోనే హామీ ఇచ్చారని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ పథకాలు దేశానికే ఆదర్శం అంటూ ప్రశంసలు కురిపించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తికి చెందిన వెంకట్రామిరెడ్డి 1996లో గ్రూపు1కు సెలెక్టయ్యారు. 2007లో కన్ఫర్డ్ ఐఏఎస్ అయ్యారు. హుడా సెక్రెటరీగా, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గా, సంగారెడ్డి, సిద్దిపేట కలెక్టర్‌గా చేశారు. సీఎం కేసీఆర్ కు కాళ్లు మొక్కడం ద్వారా వెంకట్రామిరెడ్డి పలుమార్లు వార్తల్లో వ్యక్తి అయ్యారు. కాంగ్రెస్ సహా విపక్షాలు, ప్రజాసంఘాలు సైతం ఆయనపై విమర్శలు చేశాయి. సిద్ధిపేట కలెక్టరేట్ ప్రారంభోత్సవమప్పుడు కలెక్టర్ హోదాలో కేసీఆర్ కాళ్లు మొక్కడంపై అప్పట్లో చర్చ జరిగింది. పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ కండువా కప్పుకొమ్మని అపోజిషన్ లీడర్లు విమర్శించారు. 2016లో సిద్దిపేట తొలి కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకుంటూ ఆయన కేసీఆర్ కాళ్లు మొక్కారు. ఆయన తెలంగాణ గాడ్ ఫాదర్ అనీ, అందుకే పెద్దాయనగా భావించి కాళ్ళు మొక్కానని వెంకట్రామిరెడ్డి తనను తాను సమర్ధించుకున్నారు.
మొత్తం మీద తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ వీర విధేయుడు ఒకరు పాలనా అనుభవం నుంచి రాజకీయానుభవం వైపు అడుగులు వేశారు. రాజకీయాల్లో ఆయన ఎలాంటి సంచలనాలకు కేంద్ర బింధువు అవుతారో చూడాలి.