కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదలలో జాప్యం జరిగిన ‘రిపబ్లిక్’ మూవీ, గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న జనం ముందుకొచ్చింది. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్ళి బయటకు వచ్చిన సాయితేజ్ నటించిన ఈ సినిమా గురించి మెగాభిమానులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. అంతేకాదు… ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇటు సినిమారంగంలో అటు రాజకీయ రంగంలో ప్రకంపనలు సృష్టించాయి. దాంతో సినీ, రాజకీయ ప్రముఖుల దృష్టి ‘రిపబ్లిక్’ చిత్రంపై పడింది. ‘ప్రస్థానం’ వంటి పొలిటికల్ డ్రామాను రక్తికట్టించిన దేవ్ కట్టా దర్శకత్వంలో జె. భగవాన్, పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు.
కథ విషయానికి వస్తే…. 1970లో ప్రపంచ ఖ్యాతి గడించిన తెల్లేరు సరస్సు… మూడు దశాబ్దాలు గడిచే సరికీ కబ్జాలకు గురవుతుంది. రాజకీయ ప్రాబల్యం ఉన్న వ్యక్తులు ఆ సరస్సును ఆక్రమించుకోవడమే కాకుండా అందులో చేపలకు విషాహారాన్ని మేతగా వేయడంతో, దాని ద్వారా ఏర్పడిన వైరస్ ఆ ప్రాంత వాసుల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తుంది. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, ప్రాంతీయ పార్టీ అధినేత్రి విశాఖ వాణి (రమ్యకృష్ణ) రాష్ట్ర పగ్గాలను చేపడుతుంది. తన కొడుకును ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెడుతుంది. ప్రత్యేక అధికారాలతో ఆ ప్రాంతానికి కలెక్టర్ గా వచ్చిన పంజా అభిరామ్ (సాయి తేజ్) రాజకీయ నాయకురాలు విశాఖ వాణికి ఎలా బుద్ధి చెప్పాడు? తదనంతర పరిణామాలు ఏమిటీ? అనేదే ఈ చిత్ర కథ.
పైకి ఇది మంచినీటి సరస్సుకు సంబంధించిన సమస్యగా కనిపించినా ఇందులో ప్రస్తుతం వ్యవస్థలోని లోటుపాట్లను దర్శకుడు దేవ్ కట్టా మిళితం చేశాడు. అవినీతి పరుడైన తండ్రిని కాదని తన కాళ్ళ మీద తాను నిలబడే వ్యక్తిగా అభిరామ్ పాత్రను తీర్చిదిద్దాడు. అదే సమయంలో అతని తండ్రి దశరథ్ (జగపతిబాబు) ఎందుకు అవినీతి పరుడుగా మారాడో చూపించాడు. ఇక కనిపించని అన్నయ్యను వెత్తుకుంటూ విదేశాల నుండి వచ్చిన యువతి మైరా (ఐశ్వర్యా రాజేశ్) పాత్రకూ తగిన ప్రాధాన్యమిచ్చాడు. ఈ వ్యవస్థను ప్రశ్నిస్తే… ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ఆమె పాత్ర ద్వారా, ఆమె అన్న పాత్ర ద్వారా చూపించాడు. కరెప్టెడ్ బ్యూరోక్రాట్స్ పొలిటికల్ లీడర్స్ అడుగులకు మడుగులొత్తితే ఎలాంటి దారుణాలు జరుగుతాయో, పోలీస్ సిస్టమ్ అవినీతి మయమైతే ఎలాంటి దారుణాలు చోటు చేసుకుంటాయో చెప్పడానికి కలెక్టర్, ఎస్పీ పాత్రలను వాడుకున్నాడు. నిజాయితీ పరుడైనా కమ్యూనిస్టు పార్టీ నేత కూతురు… తండ్రి సాధించలేనిది అడ్డదారులు తొక్కి ఎలా సాధించిందో, తన కొడుకును సీఎం పీఠంపై ఎలా కూర్చో పెట్టగలిగిందో విశాఖవాణి పాత్ర ద్వారా చూపించాడు. ఇలా ప్రతి పాత్రకూ ఓ మోటివ్ ను, వాటి ప్రవర్తన వెనుక ఓ లాజిక్ ను దేవ్ కట్టా స్క్రిప్ట్ దశలోనే పకడ్బందీగా రాసుకున్నాడు. దాంతో మూవీ మొత్తం స్ట్రయిట్ నేరేషన్ లో సాఫీగా సాగిపోయింది. ఒక్క హీరో తండ్రి గతాన్ని మాత్రమే ఫ్లాష్ బ్యాక్ లో చూపించారు. ఇటీవల సాయితేజ్ బైక్ మీద నుండి స్కిడ్ అయి పడిపోయి, హాస్పిటల్ పాలయ్యాడన్నది అందరికీ తెలిసిందే, సరిగ్గా అలాంటి సీనే ఒకటి ఇందులో ఉండటం కాకతాళీయం.
కలెక్టర్ ను బదిలీ చేసే అధికారం రాష్ట్రంలోని ప్రభుత్వానికి కాకుండా యు.పి.ఎస్.సి. బోర్డ్ కే ఉండాలనే పాయింట్ కొత్తగా ఉంది. పంజా అభిరామ్ అనే కలెక్టర్ ను ఎక్స్ పెర్మెంట్ గా అందుకు వాడుకోవడం బాగుంది. అయితే… జిల్లాలో జరిగిన అల్లర్ల కారణంగా అతన్ని బర్తరఫ్ చేయడంతో తిరిగి ఇది రొటీన్ పొలిటికల్ డ్రామాగా మారిపోయింది. క్లయిమాక్స్ లో కేంద్రమంత్రి న్యాయస్థానంపై ఒత్తిడి తేవాలని చూసినా, న్యాయమూర్తి తలవొగ్గకపోవడం ఈ సినిమాకు సంబంధించి ఓ ఆశాకిరణం. ప్రభుత్వం, పరిపాలన వ్యవస్థ, న్యాయస్థానాలు… ఒక దాన్ని మరొకటి డామినేట్ చేయకుండా సమాంతరంగా సాగితేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. కానీ ఇందులో ఏ ఒక్కటి మరో దానికి కొమ్ముకాసినా, ప్రలోభాల కారణంగా లొంగిపోయినా ప్రజాస్వామ్యం అపహాస్యమౌతుంది. ఈ సినిమా ద్వారా దేవ్ కట్టా అదే చెప్పాలని చూశారు. ఈ ఆలోచనాత్మక చిత్రం కమర్షియల్ గా ఏ మేరకు విజయం సాధిస్తుందనేది పక్కన పెడితే, ఇప్పుడున్న పరిస్థితులలో ఇలాంటి చిత్రం రావాలి, ప్రజలంతా చూడాలి. ఈ వ్యవస్థను బాగు చేయడం కోసం తపించే వ్యక్తులకు బాసటగా నిలబడే ప్రయత్నం చేయాలి. సినిమా మాధ్యమం ద్వారా కేవలం వినోదాన్ని మాత్రమే అందించడం కాకుండా, మన మధ్య జరుగుతున్న అవినీతి, అక్రమాలను వేలెత్తి చూపించే ఇలాంటి చిత్రాలను ప్రోత్సహించాలి. ఇందులో పోలీస్ వ్యవస్థ కూడా చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో తమ చేతుల్లోకి తీసుకోకూడదు, అది రేపిస్టులను ఎన్ కౌంటర్ చేయడమైనా సరే అని హీరో పాత్ర ద్వారా చెప్పిండం బాగుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే… ఈ కథను సాయితేజ్ మనసా వాచా నమ్మారనిపిస్తోంది. పంజా అభిరామ్ పాత్రలో అతను లీనమైపోయాడు. సాయి తేజ్, జగపతిబాబు మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు, అలానే రమ్యకృష్ణను తొలిసారి అతను కలిసినప్పుడు వెలిబుచ్చిన అభిప్రాయాలు మూవీకి హైలైట్ గా నిలుస్తాయి. ప్రాంతీయపార్టీ అధినేత్రిగా రమ్యకృష్ణ మరో పవర్ ఫుల్ పాత్రను ఇందులో పోషించింది. కరడుకట్టిన పొలిటికల్ లీడర్ గానే కాకుండా క్లయిమాక్స్ లో ఈ వ్యవస్థ మారదంటూ ఆమె వెలిబుచ్చిన ఆవేదన హృదయానికి హత్తుకుంటుంది. ఎన్.ఆర్.ఐ. మహిళ మైరా పాత్రకు ఐశ్వర్యా రాజేశ్ చక్కగా సూట్ అయ్యింది. ఎప్పటిలానే జగపతి బాబు తన పాత్రలోని భిన్నమైన కోణాలను అద్భుతంగా ఆవిష్కరించారు. ఆటో డ్రైవర్ మణిగా రాహుల్ రామకృష్ణ కనిపించేది కాసేపే అయినా గుర్తుండి పోయే పాత్ర చేశాడు. జగపతిబాబు భార్యగా ఆమని, ఆమె కూతురుగా చేతన నటించారు. సుబ్బరాజు కలెక్టర్ గా, శ్రీకాంత్ అయ్యంగార్ ఎస్పీగా, మనోజ్ నందన్ ఎస్.ఐ.గా ఆయా పాత్రలలో మెప్పించారు.
సాంకేతిక నిపుణులలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఈ చిత్రానికి కథ, మాటలు అందించిన దర్శకుడు దేవ్ కట్టా గురించే. కాగితంపై రాసుకున్న కథను నిజాయితీగా ఆయన తెరపై ప్రెజెంట్ చేశారు. అయితే… దానిని ఏ మేరకు జనం యాక్సెప్ట్ చేస్తారన్న సందేహం లేకపోలేదు. ఈ పొలిటికల్ డ్రామాకు వాణిజ్యపరమైన మెరుగులు అద్ది ఉంటే మరింత ఎక్కువ మందిని రీచ్ అయ్యే ఆస్కారం ఉండేది. మణిశర్మ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఇందులో మూడే పాటలున్నాయి. వాటిని సుద్దాల అశోక్ తేజ్, రెహమాన్ రాశారు. అన్నీ సందర్భానుసారంగా వచ్చేవే. ఎం. సుకుమార్ సినిమాటోగ్రఫీ, కె. రవికుమార్ యాక్షన్ సీన్స్ మూవీకి హైలైట్. నిర్మాణ విలువలూ బాగున్నాయి. రొటీన్ కమర్షియల్ సినిమాలు చూడటానికి అలవాటు పడిన వారి సంగతి పక్కన పెడితే, మెగాభిమానులకు, పొలిటికల్ డ్రామాస్ ను ఇష్టపడే వారికి ‘రిపబ్లిక్’ నచ్చుతుంది.
ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న పాయింట్
ప్రధాన తారాగణం నటన
ఆలోచింప చేసే మాటలు
నిర్మాణ విలువలు
మైనెస్ పాయింట్స్
సరస్సు చుట్టూనే కథ తిరగడం
నిరాశ పరిచే క్లయిమాక్స్
రేటింగ్ : 2.75 / 5
ట్యాగ్ లైన్: పాలిటిక్స్ వర్సెస్ బ్యూరోక్రసీ!