దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త కరోనా వేరియంట్ భారత స్టాక్ మార్కెట్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో శుక్రవారం నాడు మార్కెట్ సూచీలు రికార్డు స్థాయిలో పేకమేడలా కుప్పకూలాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,688 పాయింట్లు పతనమై 57,107 వద్ద ముగియడంతో పెట్టుబడిదారుల సంపద రూ.7.45లక్షల కోట్లు ఆవిరైపోయింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ ఏకంగా 510 పాయింట్లు కోల్పోయి 17,026 వద్ద స్థిరపడింది. దక్షిణాఫ్రికా వేరియంట్ భయాలతో ఒక్క భారత సూచీలే కాదు.. దాదాపు ఆసియా సూచీలన్నీ నష్టాల్లోనే పయనించాయి. ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు మూడో వేవ్ మరింత ముప్పు తెచ్చిపెట్టే అవకాశం ఉండడంతో సూచీలు భారీగా నష్టపోయినట్లు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: ఎన్టీఆర్ షోలో మహేష్ ఎంత గెలుచుకున్నాడో తెలుసా?
దేశీయంగా కరోనా కేసులు తక్కువగా ఉన్నప్పటికి అంతర్జాతీయంగా రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతుండటం వల్ల మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడినట్లు తెలుస్తోంది. కాగా దక్షిణాఫ్రికాలో నమోదైన కొత్త వేరియంట్‌పై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన వేరియంట్ల కంటే దీనికి వేగంగా వ్యాపించే గుణం ఉన్నట్లు అంచనా వేసింది. దీనిపై చర్చకు అత్యవసర సమావేశం కానుంది.