తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో ఉదయం భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. రహదారులపై వర్షాపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కాల్వలో చెత్తచెదారం తీయకపోవడంతో వర్షపు నీరు నిలిచిపోయిందని స్థానికులు వాపోతున్నారు. అంతేకాకుండా భారీ వర్షం కారణంగా పలు కాలనీల్లో వర్షపు నీరు చేరడంతో అధికారులు వర్షపు నీటిని తోడుతున్నారు. వర్షపు నీటితో డ్రైనేజీలు పొంగి రహదారులపై ప్రవహిస్తోంది. ఇదిలా ఉండగా.. నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
దీంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో మూడు రోజులు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. ఉత్తర కోస్తాంధ్రలో నేడు, రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరికొన్ని చోట్ల ఎల్లుండి మోస్తరు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దీనితో పాటు దక్షిణ కోస్తాంధ్రలో నేడు, రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని చోట్ల ఎల్లుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రాయలసీమలో కూడా ఒకట్రెండుచోట్ల నేడు, రేపు, ఎల్లుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.