తెలంగాణలో రాజకీయ మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై ట్వీట్ల వార్ ప్రారంభించారు. కేసీఆర్ రాజ్యవిస్తరణ కాంక్షకు తెలంగాణను బలిచ్చే కుట్ర జరుగుతోంది. టీఆర్‌ఎస్ ప్లీనరీలో తెలుగుతల్లి ప్రత్యక్షం కావడం…మంత్రి పేర్ని నానీ “సమైక్య రాష్ట్ర”ప్రతిపాదన తేవడం…కేసీఆర్, జగన్ ల “ఉమ్మడి” కుట్ర. వందల మంది ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్…!అంటూ రేవంత్ రెడ్డి ఘాటైన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతోంది.
కేసీఆర్ రాజ్యవిస్తరణ కాంక్షకు తెలంగాణను బలిచ్చే కుట్ర జరుగుతోంది.
— Revanth Reddy (@revanth_anumula) October 28, 2021
ప్లీనరీలో తెలుగుతల్లి ప్రత్యక్షం కావడం…మంత్రి పేర్ని నానీ “సమైక్య రాష్ట్ర”
ప్రతిపాదన తేవడం…
కేసీఆర్, జగన్ ల “ఉమ్మడి” కుట్ర.
వందల మంది ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్…! pic.twitter.com/Is4fDy8Okk
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి.. రెండు వీడియోలను ట్వీట్ కు జతపరిచారు. గతంలో కేసీఆర్‌ని ఆంధ్రాలో టీఆర్‌ఎస్ పార్టీ పెట్టాలని కోరడం బైట్ వుంది. మీ పథకాలు కావాలి. మీరు ఇక్కడికి వచ్చి పోటీ చేయండి అంటూ కేసీఆర్‌ను ఆంధ్రాప్రజలు కోరినట్టు ఈ వీడియోలో వుంది. అందుకు జతగా ఇవాళ రాష్ట్ర సమాచార, రోడ్డు రవాణా మంత్రి పేర్ని వెంకట్రామయ్య మాటల్ని ట్వీట్‌లో ప్రస్తావించారు రేవంత్ రెడ్డి. తాము చేస్తున్న అభివృద్ధి చూసి ఆంధ్రప్రదేశ్‌లో కూడా పార్టీ పెట్టాలని చాలామంది కోరుతున్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఇటీవల టీఆర్ఎస్ ప్లీనరీలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
కేసీఆర్ ఆంధ్రాలో పార్టీ పెడతారా లేదా అనేది పక్కన పెడితే ఈ వ్యాఖ్యలపై ఆంధ్రా లీడర్లు తమదైన శైలిలో స్పందిస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన ఏపీ మంత్రి పేర్ని నాని.. కేసీఆర్ ఏపీలో పార్టీ పెడితే మంచిదేనని, తాము కూడా అదే కోరుకుంటున్నామని అన్నారు.
కేసీఆర్ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పెట్టడం ఎందుకని, రెండు రాష్ట్రాలను మళ్లీ కలిపేస్తే బాగుంటుందని పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఏపీలో పార్టీ పెట్టడానికి ముందుగా.. రెండు తెలుగు రాష్ట్రాలను మళ్లీ కలిపేయాలని కేసీఆర్ కేబినెట్ తీర్మానం చేస్తే బాగుంటుందన్నారు. రెండు రాష్ట్రాలు కలిసిపోయాక కేసీఆర్ ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చని అన్నారు. ఏపీ, తెలంగాణ సమైక్యంగానే ఉండాలని తమ అధినేత వైఎస్ జగన్ గతంలోనే ఎన్నోసార్లు కోరుకున్నారని నాని తెలిపారు. ఇద్దరు నేతల తీరుపై పీసీసీ సారథి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లు వేడిని రాజేస్తున్నాయి.