యూపీ సమరానికి సమయం దగ్గర పడుతోంది. పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రకటనకు ప్రచారం హోరెత్తుతోంది. ప్రస్తుతం యూపీలో టోపీ రాజకీయం నడుస్తోంది. సమాజ్‌వాద్ పార్టీ ఎర్ర టోపీ కేంద్రంగా రాజకీయ చర్చ నడుస్తోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ ప్రసంగానికి ఎర్ర టోపీ ధరించిన ఎస్పీ ఎమ్మెల్యేలు అడ్డుకోవటంతో వివాదం మొదలైంది. క్యాప్ పెట్టుకున్న సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు గుండాలు అనే అర్థం వచ్చేలా యోగీ ఎగతాళి చేయటంతో వారు సభలో అలజడి సృష్టించారు. ఇక, ఇటీవల గోరఖ్‌పూర్‌లో జరిగిన ర్యాలీలోఎర్రటోపీ వారు రాష్ట్రానికి “రెడ్ అలర్ట్” అంటూ ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.
యోగీ, మోడీ ఎర్రటోపీ వ్యాఖ్యలు యదాలాపంగా చేసినవి కాదు. ఉద్దేశపూర్వకంగా చేసినవే అంటున్నారు విశ్లేషకులు. కానీ వారి వ్యాఖ్యలు పరోక్షంగా సమాజ్‌వాదీ పార్టీకి లాభించాయి. ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి వ్యాఖ్యలతో ఎర్రటోపీకి అనుకోని ప్రచారం లభించింది. దాంతో ఇప్పుడు అఖిలేష్ యాదవ్, అయన సహచరులు ఎప్పుడూ చూసినా ఎర్రటోపీతో కనిపిస్తున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు రెడ్ క్యాప్ పెట్టుకుని అసెంబ్లీలో దర్శనమిస్తున్నారు.
అఖిలేష్ యాద్ సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్ పిక్చర్ కూడా మారింది. ఎర్రటోపీ పెట్టుకున్న ఫొటో కనిపిస్తోంది. ఫేస్‌బుక్, ట్విట్టర్ ప్రొఫైల్ పిక్చర్లు చూస్తే విషయం అర్థమవుతుంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆయననే అనుసరిస్తున్నారు. అఖిలేష్ ఏ కార్యక్రమానికి వెళ్లినా .. ఏ ర్యాలీలో పాల్గొన్నా ఎర్రటోపీ ఉండాల్సిందే.
నిజానికి, గతంలో అఖిలేష్ కు ఈ టోపీని పెద్దగా ధరించేవాడు కాదు. ఐతే, తండ్రి ములాయం సింగ్ యాదవ్ సలహా మేరకు కొన్నేళ్ల నుంచి ఎక్కడికి వెళ్లినా తప్పకుండా టోపీ పెట్టుకుంటున్నారు. ఇది ఇలావుంటే, ఎస్పీ, బీజేపీ మధ్య జరుగుతున్న పోరులో ఆమ్ ఆద్మీపార్టీ కూడా చేరింది. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ, యూపీ ఇన్‌ఛార్జ్ సంజయ్ సింగ్ ట్విటర్‌లో నల్లటోపీ పెట్టుకున్న మోడీ ఫొటో షేర్ చేశారు. నల్లటి టోపీ ధరించిన వారు మంచి మనసున్న వారు కాదనే అర్థంలో క్యాప్షన్ పెట్టారు.
ఎర్రటోపీ వారితో జాగ్రత్తగా ఉండాలని ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ ప్రజలను హెచ్చరించాలనే సందేశం యెగీ, మోడీ వ్యాఖ్యలలో కనిపిస్తుంది. కానీ అది అనుకోకుండా సమాజ్‌వాదీ పార్టీకే లాభం చేకూరుస్తోంది. ఎస్పీపై దాడి చేయాలని బీజేపీ అనుకుంది..కానీ తమ వ్యాఖ్యలతో ఎర్ర టోపీకి రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున్న ఉచిత ప్రచారం వస్తుందని ఊహించలేదు. ఇప్పుడు ఎస్పీ కార్యకర్తలంతా టోపీ పెట్టుకునే కనిపిస్తున్నారు. ఆ పార్టీ ర్యాలీలు..ఇతర ప్రజా కార్యక్రమాలు..ఫ్లెక్సీలలో ఎర్ర టోపీలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.ఎన్నికల ముందు బీజేపీకి ఇదో పెద్ద తలనొప్పిగా మారింది.
మరోవైపు, సామాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రధాని మోడీ వాఖ్యలపై అదే స్థాయిలో స్పందిస్తున్నారు. ఎరుపు ఆధునికతకు గుర్తు.. ప్రేమతో పాటు విప్లవ చిహ్నం కూడా. రక్తం రంగు కూడా ఎరుపే. మరి మోడీ ఎందుకు ఎరుపుని చూసి కలత చెందుతున్నారని ఎగతాళి చేస్తున్నారు. ఇప్పుడు ప్రధాని మాట్లాడ వలసింది టోపీ రంగు గురించి కాదు.. దేశాన్ని పీడిస్తున్న ద్రవ్యోల్బణం ..నిరుద్యోగం వంటి ఎన్నో సమస్యలపై అంటూ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.
ఇక, 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఉత్తరప్రదేశ్ అత్యంత కీలకం. యూపీ చేజారితే ఢిల్లీ చేయి దాటే ప్రమాదం ఉంది. అందుకే, మోడీ సర్కార్ సాగు చట్టాలను కూడా వెనక్కి తీసుకుంది. జాట్ ఓట్ల కోసమే బీజేపీ ఆ పనిచేసిందనేది బహిరంగ రహస్యం. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో జాట్లదే ఆధిపత్యం. రాష్ట్రీయ జనతాదళ్‌కు ఈ ప్రాంతంలో మంచి పట్టుంది. అది ఇప్పుడు సమాజ్‌వాదీ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళుతోంది. ఇది బీజేపీకి ఆందోళన కలిగిస్తోంది.
యూపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారిన ఎర్రటోపీ కథ ఏమిటో ఓసారి చూద్దాం. ములాయం సింగ్ పార్టీని స్థాపించనప్పుడు ఎర్రటోపీ లేదు. కొంత మంది గాంధీ టోపీ పెట్టుకునేవారు. ఐతే, సమాజ్‌వాదీ పార్టీ తొలి యువజన సభలకు ఎర్రటోపీ పెట్టుకుని రావాలని ములాయం పిలుపునిచ్చారు. ఐతే, ఆ పార్టీ నాయకులు వాటిని అధికారికంగా ధరించింది 2002లో కాన్పూర్ సమావేశంలో. అప్పుడు నలుగురు ఐదుగురు పార్టీ నేతలు ఎర్రటోపీతో కనిపించారు. 2012లో అఖిలేష్ అధికారం చేపట్టిన తరువాత ఈ సంస్కృతి పెరిగింది. పార్టీ ఎమ్మెల్యేలు ఎర్రటోపీ పెట్టుకుని అసెంబ్లీ రావటం ప్రారంభమంది. రాష్ట్రంలో బీజేపీ కాషాయ రంగు ఆధిపత్యం పెరిగటంతో ..దానికి ప్రత్యామ్నాయంగా ఎరుపును బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అఖిలేష్ భావించారు. ఆ పార్టీ జెండాలో కూడా ఎరుపు ఉంది. దాంతో ఆయన ఎర్రటోపీపై ఫోకస్ పెంచాడు.
నిజానికి భారత రాజకీయాలలో టోపీ సంస్కృతి కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ మార్క్ గాంధీ టోపీ. మహాత్ముడే దీనిని ప్రాచుర్యంలోకి తెచ్చారు. అందుకే గాంధీ టోపీ అంటారు.స్వాంత్రంత్ర్యం వచ్చిన తరువాత కూడా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు ఈ టోపీ డ్రెస్‌కోడ్‌గా మారింది.
1918-1921 మధ్య సహాయ నిరాకరణ సమయంలో గాంధీ టోపీకి విశేష ప్రాచుర్యం లభించింది. స్వాభిమానం, స్వావలంబన, సంఘీభావానికి గుర్తుగా గాంధీ టోపీ మారిపోయింది. దాంతో ఒక దశలో బ్రిటిష్ ప్రభుత్వం దానిని నిషేధించాలని కూడా చూసింది. వాస్తవానికి, ఈ టోపీ సంస్కృతిని గాంధీ దక్షిణాఫ్రికా నుంచి దిగుమతి చేశారని చెబుతారు. అక్కడ జైలులో ఉన్నప్పుడు ఈ టోపీ ధరించాల్సి వచ్చింది. అదే గాంధీ టోపీ పుట్టుకకు ఊపిరిపోసింది అనే వాదన ప్రాచుర్యంలో ఉంది.
మరోవైపు, గాంధీ టోపీ పుట్టుక రాంపూర్ సంస్థానంలో జరిగిందని కొందరు వాదిస్తారు. మహాత్మా గాంధీ 1920లో రాంపూర్ సంస్థానాన్ని సందర్శించారు. ఓ వివాహానికి హాజరయ్యేందుకు వెళ్లిన గాంధీ.. తరువాత రాంపూర్ నవాబును కలవాలనుకున్నారు. ఐతే, నవాబు ఆస్థానంలోకి తలపాగ ధరించి వెళ్లటం సంప్రదాయం. కానీ గాంధీజీకి తలపాగా లేకపోవటంతో.. ఖిలాఫత్ ఉద్యమ నేత మహ్మద్ అలీ జౌహార తల్లి అబాదీ బేగం అప్పటికప్పుడు గారా ముతక బట్టతో టోపీ తయారుచేసి ఇచ్చిందని చెబుతారు. మరోవైపు, సబర్మతి, వార్ధాలో గాంధీ టోపీ మూలాలు ఉన్నాయని చాలా మంది అనుకుంటారు. కానీ దేనికి నిర్థిష్టమైన ఆధారాలు లేవు.
ఇప్పటికీ భారత రాజకీయాలలో గాంధీ టోపీకి ప్రాధాన్యత ఉంది. సామాజిక కార్యకర్త అన్నా హజారే గాంధీ టోపీ ధరించి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద అవినీతిపై పోరాటం చేశాడు. మహారాష్ట్రలో నేతలతో పాటు రైతులు కూడా గాంధీ టోపీ పెట్టుకునే పనులకు వెళతారు. అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి గాంధీ టోపీ ప్రత్యేకత తెచ్చి పెట్టింది. ఆ పార్టీ కార్యకర్తలు తరచూ టోపీ ధరించి కనిపిస్తారు. ఆరెస్సెస్‌లో కూడా ఈ కల్చర్ ఉంది. స్వయం సేవకులు నల్లరంగు క్యాప్ ధరిస్తారు. 1925లో ఆరెస్సెస్ ఏర్పడినప్పుడు ఖాకీ టోపీ పెట్టుకునేవారు.1930లో దాని స్థానంలో నల్లరంగు టోపీ వచ్చింది.
ప్రస్తుతం ఎర్రటోపీ వార్తల్లో నిలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ఎరుపు వర్సెస్ కాషాయంగా మారింది. పలు పార్టీలు రంగంలో ఉన్నా ప్రధాన పోటీ బీజేపీ, ఎస్పీ మధ్యనే ఉంటుంది. ఒకప్పుడు అధికారం చేపట్టిన బీఎస్పీ ఇప్పుడు నామ మాత్రంగా మిగిలింది. కాంగ్రెస్ పరిస్థితి కూడా అలాగు ఉంది. ఆ పార్టీ ప్రచారం అంతా ప్రియాంక చుట్టే తిరుగుతోంది. ఈ నేపథ్యంలో తుది సమరం బీజేపీ, ఎస్పీ మధ్యనే అనే భావన ప్రజల్లోకి వెళ్లింది. ఇప్పటికే ఆ పార్టీ ఆర్‌ఎల్డీతో పాటు మరికొన్ని చిన్న పార్టీలతో పొత్తు కుదుర్చుకుంది. మరోవైపు, బీజేపీ కూడా తన ప్రధాన ప్రత్యర్థి సమాజ్ వాదీ పార్టీ అని ఫిక్స్ అయింది. అందుకే, ప్రధాని మోడీ సమాజ్ వాదీ పార్టీపై విమర్శల తీవ్రత పెంచారు.
బీజేపీ, సమాజ్ వాదీ పార్టీ మధ్య అంతరం తగ్గుతోంది. బీజేపీ వర్గాలు కూడా దీనిని అంగీకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, వచ్చే ఎన్నికలలో బీజేపీ అతి కష్టం మీద బయటపడే అవకాశం ఉంది. 2017 తో పోలిస్తే ఈ సారి కనీసం 100 సీట్లు తగ్గుతాయని సీ ఓటర్ సర్వే పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విశేషంగా జనం దృష్టిని ఆకర్షిస్తున్న ఎర్రటోపీని బీజేపీ టార్గెట్ చేసింది. ఇప్పడు తన ఆరోపణలకు ఎర్రటోపీని కూడా జత చేయటం పరిస్థితికి అద్దంపడుతోంది. ఏదేమైనా ఇది ఎస్పీకి కలిసొచ్చేలా కనిపిస్తోంది..చూద్దాం ఏం జరుగుతుందో!!