మరో వారం రోజుల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది… 2021కి బైబై చెప్పి.. 2022లోకి అడుగుపెట్టబోతున్నాం.. అయితే, కొత్త సంవత్సరంలో అనేక మార్పులు రాబోతున్నాయి… బ్యాంకింగ్ రంగంలోతో పాటు.. ఇతర రంగాల్లోనూ కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. నూతన సంవత్సరం మొదటి రోజు అంటే జనవరి 1వ తేదీ నుంచి ఆన్‌లైన్ కార్డు లావాదేవీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.. వినియోగదారుల భద్రతే లక్ష్యంగా గతంలో కస్టమర్ల కార్డు వివరాలను సేవ్ చేసుకోకుండా వ్యాపారులను నియంత్రిస్తూ ఆర్బీఐ మార్గదర్శకాలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే కాగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కార్డు టోకనైజేషన్ సర్వీసులపైనా మార్గదర్శకాలను విడుదల చేసింది ఆర్బీఐ.. వినియోగదారుల సమ్మతితోనే కార్డు డాటా టోకనైజేషన్ ముందుకు సాగాలని అందులో పేర్కొంది. అంటే, యూనిక్ ఆల్గరిథమ్ జెనరేటెడ్ కోడ్‌తో కార్డు వివరాలను రీప్లేస్ చేసేందుకు టోకనైజేషన్ సహకరిస్తుంది. అయితే, ఈ కొత్త మార్గదర్శకాలన్నీ 2022 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.
ఆర్బీఐ కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ఆన్‌లైన్ కార్డు లావాదేవీలపై కొత్త రూల్స్ ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని పరిశీలిస్తే.. జనవరి 1 నుంచి ఏ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌పైనా.. కస్టమర్లు తమ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వివరాలను సేవ్ చేయడానికి వీలులేదు.. ఆన్‌లైన్ లావాదేవీ జరిపిన ప్రతీసారి తమ కార్డు వివరాలను కస్టమర్లు ఎంటర్ చేయాల్సిందే.. ఈ ప్రక్రియ ఇబ్బందిగా ఉందనుకుంటే.. తమ కార్డులను టోకనైజ్ చేయవచ్చని ఈ-కామర్స్ సంస్థలకు సంబంధిత కస్టమర్లు అంగీకారం తెలియజేయాల్సి ఉంటుంది. అప్పుడే కస్టమర్ కార్డు వివరాలను సదరు కార్డు నెట్‌వర్క్ సంస్థను అడిగి ఈ-కామర్స్ కంపెనీలు పొందేవీలు ఉంటుంది. ఇక, ఒక్కసారి ఈ-కామర్స్ సంస్థ.. కార్డు వివరాలను అందుకుంటే, ఆపై కస్టమర్లు తమ తదుపరి లావాదేవీల కోసం సదరు కార్డు వివరాలను ఆ ఈ-కామర్స్ వేదికపై సేవ్ చేసుకునే వీలు కలగనుంది.
కాగా, ప్రస్తుతం మాస్టర్‌కార్డ్, వీసా మాత్రమే తమ కస్టమర్ల కార్డుల టోకనైజేషన్‌కు ఈ-కామర్స్ సంస్థలను అనుమతిస్తూ వస్తున్నాయి.. కానీ, ఆర్బీఐ కొత్త నిబంధనల నేపథ్యంలో మరిన్ని కార్డు సంస్థలూ టోకనైజేషన్‌ను అంగీకరించే వీలుకలగనుంది… దీంతో.. వినియోగదారులు సులభంగా గుర్తించడానికి టోకనైజ్డ్ కార్డుల చివరి నాలుగు అంకెలను ఈ-కామర్స్ సంస్థలు చూపిస్తాయి. జారీచేసిన బ్యాంకు, కార్డు నెట్‌వర్క్ సంస్థ పేరూ కనిపించనున్నాయి.. కార్డుల టోకనైజేషన్ కోసం కస్టమర్లు ఎటువంటి అదనపు చెల్లింపులను చేయాల్సిన అవసరం ఉండగు. మరోవిషయం ఏంటంటే.. ఆర్బీఐ కొత్త రూల్స్ అంతర్జాతీయ లావాదేవీలకు వర్తించవు. కేవలం దేశీయ కార్డులు, లావాదేవీలకు మాత్రమే వర్తింపజేయనున్నారు. సెంట్రల్ బ్యాంక్ కొత్త మార్గదర్శకాలను అటు క్రెడిట్, ఇటు డెబిట్ కార్డుల సంస్థలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.. చివరగా కార్డు టోకనైజేషన్ కస్టమర్లకు తప్పనిసరేమీ కాదు. లావాదేవీలను వేగంగా జరుపడానికే ఇది అవసరమని గుర్తుంచుకుంటే మంచిది.. ఇక, ఇష్టం లేకపోతే ప్రతీసారి లావాదేవీ కోసం కార్డు వివరాలను కస్టమర్లు ఎంటర్ చేసుకునే వీలుకూడా ఉంటుంది.