అనర్హత వేటుకు గురయిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన బంగ్లాను ఖాళీ చేయనున్నారు. పార్లమెంట్ సభ్యులకు కేటాయించే అధికారిక బంగళాను ఖాళీ చేయాలంటూ కేంద్రం జారీ చేసిన నోటీసులపై రాహుల్ గాంధీ స్పందించారు. ప్రభుత్వ నోటీసులకు కట్టుబడి ఉంటానన్న ఆయన బంగ్లా ఖాళీ చేస్తానంటూ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత ఢిల్లీలోని తన బంగ్లాను ఖాళీ చేయాలని కేంద్రం కోరింది. ఏప్రిల్ 23లోగా తన 12 తుగ్లక్ లేన్ బంగ్లాను ఖాళీ చేయాలని కాంగ్రెస్ నేతకు నిన్న నోటీసులు అందాయి. ఈ నేపత్యంలో స్పందించిన రాహుల్ గాంధీ, నోటీసుకు కట్టుబడి ఉంటానని లేఖలో స్పష్టం చేశారు.
Alsor Read: Koratala Shiva: ఆ టెక్నీషియన్స్ ఏంటి మావా… హాలీవుడ్ సినిమా చేస్తున్నావా?
”గత నాలుగు పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికైన సభ్యునిగా, నేను ఇక్కడ గడిపాను. ఈ భవనంతో ఎన్నో ఆనందకరమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఇందుకు కారణం ప్రజలే.వారికి రుణపడి ఉన్నాను” అని రాహుల్ గాంధీ లోక్‌సభ సెక్రటేరియట్‌కు లేఖ రాశారు. తన హక్కులకు భంగం కలగకుండా, మీ లేఖలో ఉన్న వివరాలకు కట్టుబడి ఉంటాను అని తెలిపారు. 2004లో ఎంపీగా అరంగేట్రం చేసిన రాహుల్ గాంధీ 2005 నుంచి ఢిల్లీలోని తుగ్లక్ లేన్‌లోని బంగ్లాలో ఉంటున్నారు. ఇప్పటి వరకు ఇదే రాహుల్ అధికారిక నివాసంగా ఉంది. రాహుల్ గాంధీ తొలిసారిగా 2004లో ఎంపీగా పార్లమెంటులో కాలుపెట్టారు. ఇప్పటివరకూ నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.
Alsor Read: EPFO: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పీఎఫ్ వడ్డీరేటు పెంచిన కేంద్రం
కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఇంటి పేరుపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో రాహుల్ దోషిగా తేలడంతో ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఈ క్రమంలోనే ఎంపీగా ఆయనకు గతంలో కేటాయించిన అధికారిక భవనాన్ని కూడా ఖాళీ చేయాలంటూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. పరువు నష్టం కేసులో గుజరాత్‌లోని కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించిన ఒక రోజు తర్వాత ఆయన MPగా అనర్హత వేటు పడింది. రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించబడింది. అయితే, అప్పీలు దాఖలు చేసేందుకు రాహుల్ గాంధీకి 30 రోజుల గడువు ఉంది. ఒకవేళ తీర్పును రద్దు చేస్తే, అతనిపై అనర్హత వేటు పడుతుంది. కాంగ్రెస్ ప్రతీకార రాజకీయాల ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది.