వచ్చే పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చావోరేవో అన్నట్లుగా మారాయి. వరుసగా రెండుసార్లు కేంద్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోవడంతో ఆపార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ లోని కీలక నేతలంతా ఎవరి దారి వారు చూసుకోవడంతో ఆపార్టీ నడిపించాల్సి బాధ్యత ‘గాంధీ’ కుటుంబంపైనే పడింది. దీంతో ఆ కుటుంబంలోని ప్రతీఒక్కరు వచ్చే ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకొని బరిలో దిగుతున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికలకు ముందు వస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ధీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేసుకుంటోంది.
త్వరలో జరుగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉంది. దీంతో బీజేపీకి సైతం ఎన్నికలు సవాలుగా మారనున్నాయి. వరుసగా కేంద్రంలో బీజేపీ రెండుసార్లు అధికారంలోకి రావడంతో సహజంగానే ఆపార్టీపై ప్రజల్లో కొంత వ్యతిరేకత వస్తుంది. దీనికితోడు ఆ రాష్ట్రాల్లోనూ కొంత వ్యతిరేకత ఉండే అవకాశం ఉంది. దీంతో బీజేపీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడం కత్తి మీద సాములా మారుతోంది. ఈ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది.
దీనిలో భాగంగానే ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ ఉంది. దీనికితోడు అత్యధిక అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు ఇక్కడే ఉన్నాయి. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ ఎక్కువ స్థానాలు గెలుచుకోవడంతో కేంద్రంలో సులువుగా అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ రాష్ట్రంలో ఎవరు గెలుపు సాధిస్తే వారికే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ సీట్లు ఎక్కువ వచ్చే అవకాశాలున్నాయి. దీంతో ఉత్తరప్రదేశ్ ను కాంగ్రెస్ ఛాలెంజ్ గా తీసుకొని బరిలో నిలుస్తోంది.
ఈ మేరకు కాంగ్రెస్ తన అమ్ములపొదిలో ఎప్పటి నుంచి దాచుకున్న బ్రహ్మస్త్రాన్ని బయటికి తీసుకొస్తోంది. ఆ బ్రహ్మస్త్రంపైనే కాంగ్రెస్ పార్టీ భారీ ఆశలు పెట్టుకుంది. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ప్రయోగించే బ్రహ్మస్త్రం పేరే ‘ప్రియాంక గాంధీ’. ఆమె ఇప్పటికే ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంత ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతున్నారు. ఆమె సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిజ్ఞా యాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 12వేల కిలోమీటర్లు తిరగనుంది. ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్రతో ప్రియాంకా గాంధీ ప్రతీ మారుమూల గ్రామాన్ని పలుకరించనున్నారు. ఇదే సమయంలో సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీని ప్రకటిస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆపార్టీ సీనియర్లు అధిష్టానానికి సూచిస్తున్నారు.
ప్రియాంక గాంధీ ప్రచారం చేసే సమయంలో సీఎం అభ్యర్థిగా ఆమెను ప్రకటించడంతోపాటు పోటీ చేసే నియోజకవర్గాన్ని కూడా ఖరారు చేయనున్నారని తెలుస్తోంది. ప్రియాంక గాంధీ రాయబరేలీ లేదంటే అమేథి లోక్ సభ నియోజవర్గాల్లోని ఏదో ఒక అసెంబ్లీ స్థానానికి పోటీ చేసే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాయబరేలి, అమేథి రెండు ప్రాంతాలు కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. గతంలోనూ ఈ స్థానాల్లో ఆమె తన తల్లి సోనియాగాంధీ, అన్న రాహుల్ గాంధీ కోసం ప్రచారం చేశారు.
ఇదిలా ఉంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథి నుంచి ఓటమి పాలయ్యారు. స్థానిక నేతల కుమ్ములాటలకు తోడు రాహుల్ దృష్టంతా జాతీయ రాజకీయాలపైనే ఉండటంతో ఇక్కడి పెద్దగా దృష్టిసారించ లేకపోయారు. ఈ అవకాశాన్ని బీజేపీ సద్వినియోగం చేసుకొని అమేథిలో తమ జెండాను ఎగురవేసింది. దీంతో తిరిగి ఈ నియోజకవర్గంపై తమ పట్టు కాపాడుకునేలా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. దీనిలో భాగంగానే ఆమె అమేథి అసెంబ్లీ సీటుకు పోటీ చేసే అవకాశం లేకపోలేదని టాక్ విన్పిస్తుంది.
మొత్తంగా ఆమె రాయబరేలీ లేదంటే అమేథి లోక్ సభ పరిధిలో నుంచి ఆమె పోటీ చేయడం ఖాయంగా కన్పిస్తుంది. ఆమె ప్రచారం సైతం ఈ రెండు నియోజకవర్గాల చుట్టూ ఎక్కువగా ఉండటంతో రాజకీయకీయ విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరీ ప్రియాంక గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో?. మరోవైపు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటిరిగానే బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించింది. ఈసారి పొత్తులు లేకుండా బరిలో దిగుతోంది.