కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుపై కేసు నమోదు చేశారు పోలీసులు.. నిన్న రామతీర్థం ఘటన నేపథ్యంలో ఆలయ ఈవో ప్రసాద్ ఫిర్యాదు మేరకు నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.. రామతీర్థంలో శంకుస్థాపన కార్యక్రమానికి, తమ విధులకు ఆటంకం కలిగించారంటూ అశోక్‌గజపతిరాజుపై ఫిర్యాదు చేశారు ఈవో ప్రసాద్.. దీంతో.. 473, 353 సెక్షన్ల కింద అశోక్ గజపతిపై కేసు నమోదు చేశారు పోలీసులు..
కాగా, విజయనగరం రామతీర్థం బోడికొండపై బుధవారం రోజు తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే.. రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన జరుగుతున్న సమయంలో ఆలయ ధర్మ కర్త అశోక్ గజపతిరాజుకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. తనను కొబ్బరికాయ కొట్టకుండా మంత్రి వెల్లంపల్లి అడ్డుకున్నారని అసహనం వ్యక్తం చేసిన అశోక్ గజపతి.. ఆ తర్వాత ఆందోళనకు దిగారు.. ఇక, శిలా ఫలకం బోర్డును తొలగించే ప్రయత్నం కూడా చేశారు. కానీ, పోలీసుల సాయంతో మంత్రులు శిలాఫలకం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ ఘటనలో అశోక్ గజపతి రాజుపై మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, బొత్స సత్యనారయణపై విమర్శలు గుప్పిస్తే.. మంత్రుల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు సహా.. పలువురు నేతలు మండిపడ్డారు.